
- నీళ్లను తన్నుకుపోతున్నా ఆపని అధికారులు
- సాగర్ నీళ్ల దోపిడీపై స్పందించని కృష్ణా బోర్డు
- ఫిర్యాదు చేస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం
- కనీసం సమాచారం ఇవ్వని జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ
- మన అధికారులపై వేధింపులు.. డిప్యూటేషన్లపై పెత్తనం
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల విషయంలో తెలంగాణపై వివక్ష కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కృష్ణా, గోదావరి బోర్డులు తెలంగాణ చేస్తున్న వినతులను పట్టించుకోవడం లేవు. ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), అటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ తీరుపై ఎన్నిసార్లు బోర్డులకు ఫిర్యాదు చేసినా.. లేఖలు రాసినా పొరుగు రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయే తప్ప.. చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
పైగా, కృష్ణా జలాల విషయంలో ‘నీళ్లు తీసుకుపోతే తప్పేంటి?’ అని కేఆర్ఎంబీ తెలంగాణను ప్రశ్నిస్తున్నది. అటు, గోదావరిలో జీబీ లింక్‌పై వివరాలు అడిగితే.. ‘‘మీకు చెప్పాల్సిన అవసరం లేదు’’అంటూ జీఆర్ఎంబీ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నది. కేంద్రంలో ఏపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో.. పొరుగు రాష్ట్రం ఏది చెప్తే అదే అన్నట్టుగా రెండు బోర్డులు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణా జలాల తరలింపును అడ్డుకోలే..
ఇటు శ్రీశైలం, అటు సాగర్ నుంచి ఏపీ సర్కార్ నీటి దోపిడీకి పాల్పడుతున్నా కేఆర్ఎంబీ అడ్డుకోలేకపోయింది. శ్రీశైలం నుంచి నీళ్లను పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి వందల టీఎంసీలు పెన్నా బేసిన్‌కు తరలించినా బోర్డు చప్పుడు చేయలేదు. మొన్నటికి మొన్న సాగర్ కుడి కాల్వ ద్వారా రోజూ ఒక టీఎంసీ చొప్పున నీటిని ఏపీ దోచుకెళ్తున్నదని తెలంగాణ ఫిర్యాదు చేసినప్పటికీ బోర్డు కనీసం మీటింగ్ పెట్టలేదు. తెలంగాణ సర్కార్ పదే పదే డిమాండ్ చేయడంతో ఫిబ్రవరిలో 2 సార్లు మీటింగ్ నిర్వహించింది.
తొలుత 21న ఆ తర్వాత 26, 27వ తేదీల్లో సమావేశాలు పెట్టింది. ఏపీని కేవలం 5 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేలా ఆంక్షలు విధించాలని ఆయా మీటింగుల్లో తెలంగాణ ఫిర్యాదు చేసింది. దానికి బోర్డు ఓకే చెప్పినా.. ఏపీ మాత్రం తన నీటి దోపిడీని మాత్రం ఆపలేదు. మొన్నటి వరకు రోజూ 7 వేల నుంచి 8 వేల క్యూసెక్కుల వరకు నీటిని దండుకుపోయింది. నీటి దోపిడీకి పాల్పడుతున్నా కృష్ణా బోర్డు పట్టించుకోలేదు.
కృష్ణా బోర్డులో ఏపీ అధికారుల పాగా..!
ఏపీ అధికారులతో నింపేసేందుకు కృష్ణా బోర్డు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. బోర్డులో చైర్మన్, మెంబర్ సెక్రటరీలను కేంద్రం నియమిస్తే.. అక్కడ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం ఇరు రాష్ట్రాలు సమానంగా అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఇద్దరు ఎస్ఈలు, నలుగురు ఈఈలు, ఆరుగురు డీఈఈలు, 10 మంది ఏఈఈలు సహా 22 పోస్టులు రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్నాయి. అంటే 11 మంది చొప్పున రెండు రాష్ట్రాల అధికారులు బోర్డులో విధులు నిర్వర్తించాలి.
కానీ, ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన పోస్టుల్లో సగం ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కేఆర్ఎంబీలో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా.. అధికారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. బోర్డును ఏపీకి తరలించే ఆలోచన ఉండటంతో అందులో పనిచేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇదే అదునుగా భావించిన బోర్డు.. ఇష్టమొచ్చినట్లు ఏపీకి చెందిన అధికారులను తీసుకొచ్చి పెట్టేందుకు సిద్ధమవుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జీబీ లింక్‌పై సమాచారం ఇవ్వని బోర్డు
జీబీ లింక్‌పై కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ రాసిన లేఖలకు సంబంధించిన విషయాన్నీ తెలంగాణకు చెప్పకుండా బోర్డు దాచేయడం గమనార్హం. దాని గురించి అడిగితే ‘‘మీకెందుకు చెప్పాలి.. మీకు చెప్పాల్సిన పని లేదు’’అంటూ మెంబర్ సెక్రటరీ బదులివ్వడం బోర్డు తీరుకు అద్దం పడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఏపీకి మాత్రం సమయానికి అన్ని వివరాలను ప్రాసెస్ చేస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ఏం చెప్పినా దానికి బోర్డు వంత పాడుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను మార్చాలంటూ కేంద్రానికి, సీడబ్ల్యూసీకి మన అధికారులు లేఖలు రాసినా.. కేంద్రం కూడా చూసీ చూడనట్టే వదిలేస్తున్నది. అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చిన వ్యక్తిని ఇప్పటికీ అక్కడే కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి
మనమంటే లెక్కేలేదు..
ఇక, జీఆర్ఎంబీ తీరు మాత్రం అసలు తెలంగాణ అధికారులంటేనే లెక్కలేదన్నట్టుగా ఉన్నది. ముఖ్యంగా ఆ బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్ తీరు మనపై ఏమాత్రం హుందాగా లేదన్నది ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మన అధికారుల డిప్యూటేషన్ పొడిగింపు, ఇతర విషయాల్లో ఈఎన్సీ స్థాయి అధికారికీ కనీస గౌరవం ఇవ్వకుండా అళగేశన్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. బోర్డుకు డిప్యూటేషన్‌పై ఎవరిని పంపాలి.. ఎవరిని పొడిగించాలి.. అన్నది మన చేతుల్లోనే ఉన్నా.. అంతా తాను చెప్పినట్టే జరగాలన్నట్టు అళగేశన్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటు మహిళా ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు, తెలంగాణ అధికారులపై కావాలని పని ఒత్తిడి తేవడం, అవసరం లేకున్నా పిలిపించుకుని తిట్టడం అళగేశన్కు అలవాటైపోయింది. ఇక, ఏపీ చేపడ్తున్న జీబీ లింక్‌పై నాలుగైదుసార్లు ఫిర్యాదు చేసినా బోర్డు పట్టించుకున్న పాపానపోలేదు. వివరాలు ఇవ్వాలని జస్ట్ ఒక లేఖ రాసి వదిలేసిందే తప్ప.. తెలంగాణకు ఇవ్వాల్సిన కనీస సమాచారానని ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.