సంగారెడ్డి జిల్లా కలుషిత నీటి ఘటనపై సర్కార్‌‌‌‌ సీరియస్‌‌‌‌

సంగారెడ్డి జిల్లా కలుషిత నీటి ఘటనపై సర్కార్‌‌‌‌ సీరియస్‌‌‌‌
  • ఇద్దరు మిషన్‌‌‌‌ భగీరథ ఏఈలపై సస్పెన్షన్‌‌‌‌ వేటు
  • విలేజ్‌‌‌‌ సెక్రటరీపై చర్యలకు నిర్ణయం

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌‌‌‌ మండలం సంజీవరావుపేటలో కలుషిత తాగునీరు తాగి ఇద్దరు చనిపోవడం, 50 మందికిపైగా అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌‌‌‌ అయింది. ఈ క్రమంలో విధుల్లో అలసత్వం వహించిన మిషన్‌‌‌‌ భగీరథ ఏఈలు శ్రీకాంత్, రవికుమార్‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్‌‌‌‌ను ఆదేశించింది.

తాగునీటిని పరీక్షించకుండా సప్లై చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సొంతంగా నిర్ణయం తీసుకుని మోటబావి నుంచి తాగునీరు సరఫరా చేసినట్లు తేలడంతో ఇద్దరిని సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఆర్డర్స్‌‌‌‌ జారీ చేసింది.

అడిషనల్ కలెక్టర్ విచారణ

సంజీవరావుపేట గ్రామాన్ని సోమవారం అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌ సందర్శించారు. కలుషిత నీరు తాగి హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం గ్రామంలో పర్యటించారు. అపరిశుభ్ర ప్రాంతాలను పరిశీలించిన అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ వాటిని వెంటనే క్లీన్‌‌‌‌ చేయాలని ఆదేశించారు. మిషన్‌‌‌‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే రిపేర్లు పూర్తి చేసి భగీరథ నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.