
- టార్గెట్ మేరకు వడ్లు సేకరించాలని ఆదేశాలు
- నిరుడి కంటే లక్ష ఎకరాల్లో అదనంగా పంట సాగు
మహబూబ్‌నగర్/వనపర్తి, వెలుగు: యాసంగి వడ్ల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే సెంటర్లను తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆఫీసర్లు జిల్లాల వారీగా సెంటర్లను ఖరారు చేశారు. టార్గెట్ మేరకు రైతుల నుంచి వడ్లను సేకరించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పెద్ద మొత్తంలో సన్నాలు వచ్చే అవకాశం..
రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించింది. గత వానాకాలం సీజన్ నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే బోనస్ ప్రకటనతో వానాకాలం సీజన్లో పెద్ద మొత్తంలో వరి సాగు అయ్యింది. ఈ యాసంగిలోనూ సాధారణ సాగు కంటే 20 శాతం ఎక్కువగా సాగైనట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రెండు, మూడు ఎకరాల వరి వేసే రైతులు కూడా ఈసారి ఐదారు ఎకరాల్లో పంటలు వేసినట్లు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం సాగు పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
దీంతో ఆఫీసర్లు ఆ లెక్కల ప్రకారమే వడ్లను సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకానికి చెందిన సన్న వడ్లు సెంటర్లకు అధికంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ యాసంగిలో వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్-ఏ రకానికి రూ.2.320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించాయి. అలాగే సన్నాలకు ప్రోత్సాహకంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు.
- వనపర్తి జిల్లాలో ఈ సీజన్లో 1.48 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. ఈ లెక్కల ప్రకారం 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యం మేరకు వడ్లు కొనుగోలు చేయాలంటే 85 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ప్రస్తుతం మిల్లర్ల వద్ద 27లక్షల బ్యాగులు ఉన్నాయి. 1,500 టార్పాలిన్లు, 15 ధాన్యం క్లీన్ చేసే ఫ్యాన్లు, 300 తేమ మెషీన్లు, 300 వేయింగ్ మెషీన్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. కాగా.. ఈ సారి జిల్లాలో కొనుగోలు సెంటర్లను పెంచారు. 414 కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఇందులో సన్న రకాలకు సంబంధించి ఐకేపీకి 106, పీఏసీఎస్‌లకు 152, మెప్మాకు ఐదు కేంద్రాలు కేటాయించారు. దొడ్డు రకాలకు సంబంధించి ఐకేపీకి 86, పీఏసీఎస్‌లకు 62, మెప్మాకు మూడు సెంటర్లు కేటాయించారు.
- నారాయణపేట జిల్లాలో ఈ సీజన్లో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో లక్షన్నర మెట్రిక్ టన్నుల వడ్లను సెంటర్ల ద్వారా సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందుకు గాను ఐకేపీ, సింగిల్ విండో, మెప్మా ద్వారా 102 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల రెండో వారం నుంచి ఈ సెంటర్లను తెరిచి రైతుల నుంచి వడ్లను సేకరించనున్నారు.
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 3,01,748 మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో మార్కెట్‌కు 2,86,660 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. అయితే మిల్లర్లు 1,38,804 మెట్రిక్ టన్నులు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా 1,47,856 మెట్రిక్ టన్నులు వడ్లను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు గాను జిల్లాలో 188 కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. వాటిలో ఐకేపీకి 102, పీఏసీఎస్‌లకు 82, డీసీఎంఎస్‌కు నాలుగు సెంటర్లు కేటాయించారు.
టార్గెట్ రీచ్ అవుతారా?
మూడేండ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల సేకరణకు సంబంధించి సివిల్ సప్లయ్ ఆఫీసర్లు టార్గెట్ రీచ్ కావడం లేదు. గత వానాకాలంలో నిర్దేశించిన లక్ష్యంలో సగం వడ్లను కూడా సేకరించలేదు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాను ఆనుకొని కర్నాటక ఉండడంతో అక్కడి వ్యాపారులు కోతల సమయంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్నారు. కల్లాల వద్దకే వెళ్లి పంటను కొంటున్నారు. వడ్లు పచ్చిగా ఉన్నా.. రేటు కట్టి లారీల్లో పంటను కర్నాటకకు తీసుకెళ్తున్నారు.
ఇక్కడ ఇచ్చే మద్దతు ధర కంటే రూ.వంద నుంచి రూ.150 వరకు ఎక్కువగా చెల్లిస్తుండడంతో.. రైతులు వారికే పంటను అమ్ముకుంటున్నారు. దీంతో ఏటా అనుకున్న లక్ష్యం మేరకు వడ్ల సేకరణ జరగడం లేదు. అయితే ఈసారి సన్నాలకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ ప్రకటించడంతో పెద్ద మొత్తంలో వడ్లు ప్రభుత్వ సెంటర్లకే వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.