- ఒక్కోటి 4 ఎకరాలవిస్తీర్ణంలో ఏర్పాటు
- ప్రతి సంఘానికి ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
- ఉత్పత్తికి రూ.3 కోట్లు ఖర్చు
- సంఘాలకు బ్యాంకు రుణాలు
- ప్రభుత్వ, దేవాదాయ, అటవీశాఖ భూముల్లో ఏర్పాటుకు యోచన
హైదరాబాద్, వెలుగు: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా తొలి విడతలో 50 గ్రామైక్య సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఒక్కో గ్రామైక్య సంఘం ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఒక మెగావాట్ ఉత్పత్తి చేయడానికి రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
దాదాపుగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో ప్లాంట్ ఏర్పాటుచేసేలా స్థల సేకరణ చేస్తున్నారు. గ్రామైక్య సంఘాలకు స్త్రీనిధి ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందించనున్నారు. ప్రభుత్వం సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రత్యేక వైబ్సైట్రూపొందించనున్నది. ఇందులో ప్లాంట్లకు సంబంధించిన విధి విధానాలను అందుబాటులోఉంచనున్నది.
టెండర్ల ప్రక్రియ పూర్తి..
ప్రభుత్వ, ఎండోమెంట్ భూములతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైన చోట అటవీశాఖ భూముల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ ప్రక్రియను జూన్ వరకు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రెడ్కో (ఇంధన సంస్థ) ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, త్వరలో టెండర్లు తెరవనున్నారు. అనంతరం కాంట్రాక్ట్ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ప్లాంట్లు నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.
సెర్ప్, స్త్రీనిధి ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందజేయనున్నారు. కాగా, ఒక్కొక్క ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు ఖర్చు కానుండగా.. ఇందులో మార్జిన్ మనీ కింద సంఘం 10 శాతం జమ చేయాలి. అంటే బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.2.70 కోట్లు వస్తే.. మిగతా రూ.30 లక్షలు గ్రామైక్య సంఘాలు జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇంత పెద్దమొత్తంలో నిధులు జమ చేయడం సంఘాలకు భారం కానుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నిధులను సైతం ఏదో ఒక రూపంలో ఇప్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
4 వేల ఎకరాల భూమి అవసరం..
రాష్ట్రవ్యాప్తంగా1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే దాదాపు 4 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది. విద్యుత్ సబ్ స్టేషన్ల సమీపంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా డీఆర్డీఓ, గ్రామైక్య సంఘాలు స్థల సేకరణ కోసం అన్వేషణ ప్రారంభించాయి. తొలి విడతలో 50 ప్లాంట్ల కోసం దాదాపుగా 200 ఎకరాల స్థలం అవసరం ఉంటుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లకు సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానున్నది.
రాష్ట్రంలో థర్మల్, హైడల్ పవర్ ద్వారా డిమాండ్‌కు సరిపడినంతగా విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయిస్తే.. సంఘాలకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకసారి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే దాదాపుగా 24 ఏండ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు తక్కువ ఖర్చు అవుతుందని, లాభం ఎక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.