ఫుడ్​ పాయిజన్ ఘటనలపై టాస్క్​ఫోర్స్​ కమిటీ

ఫుడ్​ పాయిజన్ ఘటనలపై టాస్క్​ఫోర్స్​ కమిటీ
  • ఫుడ్​ సేఫ్టీ కమిషనర్​, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు​
  • తనిఖీలు చేపట్టి కారణాలు, బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశం
  • గురుకులాలు, హాస్టళ్లు, అంగన్​వాడీలు, స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్​ సేఫ్టీ కమిటీలు  
  • ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు స్కూల్​ స్టాఫ్​తో ఏర్పాటు  
  • పర్యవేక్షకులుగా జిల్లా, డివిజన్​, మండల స్థాయి ఆఫీసర్లు.. ఉత్తర్వులు జారీ
  • విద్యార్థులను కన్న బిడ్డల్లా చూస్కోవాలని టీచర్లు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ ​సూచన
  • గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లను తరచూ విజిట్​ చేయాలని కలెక్టర్లకు ఆర్డర్​
  • నిర్లక్ష్యం చేసేవాళ్లను డ్యూటీ నుంచి తొలగిస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: గురుకులాలు, స్కూళ్లు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్​వాడీలు, ఆసుపత్రుల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్​ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్,  సంబంధిత శాఖ హెచ్​వోడీ లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా ఆఫీసర్​ను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. తనిఖీలు చేపట్టి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి నివేదిక ఇవ్వాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లు, అంగన్​వాడీల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఆర్డర్ ​ఇచ్చింది. ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, ఇద్దరు సిబ్బందితో ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది. 

ప్రతిరోజూ కిచెన్​ను పరిశీలించి, పరిసరాలు, వంటపాత్రలు శుభ్రంగా, సరుకులు తాజాగా ఉన్నాయో లేదో చెక్​ చేయాలని, ఓకే అనుకున్నాకే  వంట పని చేపట్టాలని కమిటీలకు తేల్చిచెప్పింది. వంట పూర్తయ్యాక దాన్ని ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు రుచి చూడాలని.. ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని స్పష్టం చేసింది.  మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని కలెక్టర్లకు సూచించింది. పర్యవేక్షకులు కూడా పిల్లలకు భోజనం పెట్టే ముందు కిచెన్​లో పరిశుభ్రత తనిఖీ చేయాలని, భోజనం రుచి చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. రోజూ కిచెన్​ పరిశుభ్రతకు సంబంధించి, ఫుడ్​ రుచిచూడటం వంటి యాక్టివిటీస్​పై కమిటీ ఫొటోలు తీసి రికార్డుల్లో పొందుపర్చాల్సి ఉంటుంది. త్వరలోనే నోడల్​ డిపార్ట్​మెంట్​ దీనికోసం ప్రత్యేక యాప్​ను తీసుకు వస్తుందని.. అందులో ప్రతి మీల్​కు ముందు ఇన్​స్టంట్​గా ఫొటోలు తీసి అప్​లోడ్​ చేసే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంతవరకు మొబైల్​ ఫోన్ల​లో ఫొటోలు తీసి భద్రపర్చాలని ఆదేశించింది. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా స్టూడెంట్స్​ ఫిజికల్​గా, మెంటల్​గా ఉండాలంటే మంచి ఆహారాన్ని అందించాల్సిందేనని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ALSO READ :ఫుడ్​ ఐటెమ్స్ మధ్యలో ఎలుకల మలం.. లక్డీకాపూల్​లో ఫుడ్​సెఫ్టీ అధికారుల దాడులు

అప్రతిష్టపాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు: సీఎం

విద్యార్థులను టీచర్లు, ఆఫీసర్లు కన్నబిడ్డల్లా చూసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు తరచూ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలను  తనిఖీ చేయాలని తాను పదేపదే  ఆదేశిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఫుడ్​పాయిజన్​ ఘటనలు జరగడం ఏమిటని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో కొత్తగా వేలమంది ఉపాధ్యాయులను నియమించడంతో పాటు, విద్యార్థులకు డైట్ చార్జీలు కూడా పెంచామని సీఎం గుర్తుచేశారు. పేద విద్యార్థుల కోసం తాము అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించేలా ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.