ధరణి ప్రక్షాళన చేసి రైట్ ​టు ప్రైవసీ ఎత్తేయాలి

 ధరణి ప్రక్షాళన చేసి  రైట్ ​టు ప్రైవసీ ఎత్తేయాలి

దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ భూమి లేని నిరుపేదలకు భూములు పంచిన ‘భూదానోద్యమం’ లాంటి గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణలో ఏనాడూ ఉన్న భూములు కనపడకుండా దాచుకోవడానికి అవసరం రాలేదు. కానీ, నీళ్ళు.. నిధులు.. నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలన్నిటికీ ధరణి పోర్టల్ సర్వరోగ నివారిణి అని చెప్పి దోచుకున్న భూములు దాచుకోవడానికి తెచ్చిందే ‘రైట్ టు ప్రైవసీ’.కొల్లగొట్టిన భూములనుప్రైవెసీ’ కింద  దాచుకున్నారు

గత​ప్రభుత్వం..23, ఆగస్టు 2017న ల్యాండ్ 

రికార్డ్స్ అప్డేట్ ప్రోగ్రామ్ (LRUP) లో ఒకవైపు అనుకున్న సమయంలోనే రికార్డుల డిజిటలైజేషన్ జరిగిందని, రెవెన్యూ ఉద్యోగులను ప్రశంసిస్తూ ఆర్థికంగా ప్యాకేజీలు ప్రకటించి.. ఇంకోవైపు పత్రికలలో ‘ధర్మగంట’ పేరుతో వీఆర్ఓలను అవినీతిపరులు అనే ముద్ర వేసి సర్వీసు రూల్స్​కు విరుద్ధంగా ఇతర డిపార్ట్​మెంట్లలో సర్దుబాటు చేశారు. ఇలా ఆగమేఘాల మీద రికార్డులు డిజిటలైజేషన్ చేసి ఉన్న భూ చట్టాలను తుంగలో తొక్కి,  కొత్త  ఆర్​ఓఆర్​ చట్టం తెచ్చి ధరణి పోర్టల్ కాంట్రాక్టు ప్రభుత్వ సంస్థలకు కాకుండా, ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టి.. చెరువులు, కుంటలు, అసైన్​, ప్రభుత్వ భూములు, అడవులు, దేవాదాయ భూములలో పెద్ద ఎత్తున అక్రమాలకు  తెరతీశారు. ఫలితంగా పై స్థాయి నుంచి కంప్యూటర్ ఆపరేటర్ వరకు భూములు కొల్లగొట్టడానికి అవకాశం ఇచ్చారు. ఎవరూ లేని అనాథలకు అంగీ, లాగు తొడిగి మా వారసులే అన్నట్టు జీవో 59 రెగ్యులరైజేషన్ కింద భూములు కొల్లగొట్టి,  పట్టాలు పొంది రైట్ టు ప్రైవసీ కింద దాచుకున్నారు. 

‘ధరణి’ అక్రమార్కులను భూమాత’ శిక్షించాలి

ప్రస్తుత ప్రభుత్వం మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఒక కమిటీ వేసి ధరణిని భూమాతగా, ఆర్ఓఆర్​ చట్టం స్థానంలో కొత్త చట్టం తెస్తాం అని చెప్పి విదేశీ కంపెనీ చేతిలో ఉన్న ధరణి పోర్టల్ కాంట్రాక్టును ఎన్​ఐసీ(National Informatic Centre)కు అప్పజెప్పారు. డేటా ట్రాన్స్ఫర్ కోసం నెల రోజుల సమయం ఇచ్చారు. ఇదే సమయంలో ‘Right to Privacy’ అనే ఆప్షన్ ఎత్తివేసి దోచుకుని దాచుకున్న అన్ని భూముల వివరాలు ప్రజా ప్రభుత్వం బహిర్గతం చేయాలి. ధరణి పోర్టల్ అక్రమాల నివేదిక బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలి. 

- బందెల సురేందర్ రెడ్డి