వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు. సాంకేతిక విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ వర్షాల ఆగమనం అంచనాకు అందడం లేదు. రుతువుల్లో కురవాల్సిన వర్షాల జాడే కనిపించడం లేదు. సాధారణ పరిస్థితుల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఖరీఫ్ సాగు రైతులకు పూర్తి స్థాయిలో కలిసి రావడం లేదు. అయితే భారీ వర్షాలు.. లేదంటే వానలు లేకపోవడం జరుగుతున్నది. రైతులు సకాలంలో నాట్లు నాటుకోలేకపోతున్నారు. పంట చేతికొచ్చే కాలం మారుతుంది. ఏటా ఇదే తరహా పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టం ఆవిరి అయిపోతున్నది. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయడంతోపాటు, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి. అన్నదాతలకు అవసరమైన చేయూత, భరోసా ఇవ్వాలి.
- సయ్యద్ షఫీ, హనుమకొండ