ఎవుసానికి  ఆమెనే  ఎన్నుబొక్క

దినాం కొత్త మిషిన్లు తేల్తంటే ఏటికేడు ఎవుసం ఇంత అల్కగైతంది గానీ ఇంటామె పనిజేయంది మాత్రం అస్సలు నడుస్తలేదు. ఏ పంటేసినా ఆమె మీదనే బరువు వడ్తంది. వరి పంటనే తీసుకుంటే.. నారు తీసి.. నాటేసుడు, కలుపు తీసుడు, వడ్లను ఎండబోసుడు, తూర్పారవట్టుడు ఇంటామెనే చేస్తే.. వడ్లు అలుకుడు, ఎరువు జల్లుడు, వరి కోయించుడు ఆయన పని. ఇంటామె వంగి పనిజేయందే వడ్ల కల్లం లేవది. ఏమంట మిషిన్లొచ్చినయో ఆయన పని మాత్రం సగం బడ తగ్గింది. నారు మడి, పొలం మొత్తం ఇరువాలు మూడుసాళ్లు ట్రాక్టరే దున్ని రొప్పితే, హార్వేస్టర్ కోసి వడ్లను ట్రాక్టర్లనే పోయవట్టె. ఇట్ల రైతు చేసే పని మొత్తం మిషిన్లే చేస్తంటే.. ఆమెకు ఆసరయ్యేతందుకు ఏ మిషినీ రాకపాయె. పత్తి వెట్టినా.. ఆమెకు అదే తిప్పలు. పట్టెను బట్టి ఒక్కో గింజను వంగి పెట్టుడు, ఎరువులేసుడు, నాలుగైదు సార్ల పత్తేరుడు ఆమె పనైతే.. ట్రాక్టర్​తోటి అచ్చు, గుంట్కకొట్టిచ్చుడు.. చేను అయిపోయినంక మళ్లా దాంతోనే పత్తి కట్టె కొట్టిచ్చుడే ఆయన పని. 

ఇంటి పనీ చేసుడే..

దినమంతా.. అడవిలో చేను పని చేసే ఆమెకు.. ఇంటికొచ్చినంకా పని తప్పదు. ఇల్లు ఊడ్సుడు, బాసండ్లు కడుగుడు, ఇంత ఉడ్కవెట్టి.. కూర పుల్సు చేసుడు.. ఎగిలివారంగ లేచి వాకిలి ఊడ్చి సల్లుడు, వంట చేసుడు, బట్టలు ఉతుకుడు.. అంబటాళ్ల కాంగనే ఇంత సద్ది పెట్టుకొని అడివికి పోవుడు.. ఆమెకు తీర్పాటం ఏడ ఉన్నది ఇగ? ఇంటాయన పని అట్ల కాదు.. బండిమీద పొయ్యి విత్తనాలు, మందు బస్తాలు తెస్తడు, ట్రాక్టర్​ఆయనను పిలిచి పొలం దున్నిపిస్తడు.. ఒరం మీద నిలబడి పొలానికి నీళ్లు వారిస్తడు. పొద్దీకి ఇంటికొచ్చినంక.. ఊళ్లె బెల్టు దుకాణం కాడికి పోయి ఇంత సల్లవడొత్తడు. ఇట్ల తెలంగాణలో ఉన్న దాదాపు 50 లక్షల ఎవుసాయ ఇండ్లల్ల రోజూ ఇదే నడుస్తంది.

కైకిల్లోల్లదీ అదే గోస

కైకిలికి పోయే మహిళల పరిస్థితి మరీ దారుణం.. భూముల ధరలు పెరిగి ఎవుసం చేసే భూములన్నీ వెంచర్లు అయితంటే.. చేసుకోను భూమిలేక, ఉన్న ఊర్లె కూలీ దొరక్క చాలా మంది పట్నం జేరితే.. ఊరు వట్టుకొని ఉన్నోళ్లు  ఊర్లె కైకిలి దొరకన్నాడు.. పక్క ఊరికి పోతరు. అట్ల ఆటోలు, ట్రాక్టర్లల్ల పోతంటే ఒక్కోసారి టక్కరై ప్రాణాలు పోతుంటయి. కాలు చెయ్యి ఇరిగి మంచాన పడుతుంటరు. వడదెబ్బ, పిడుగులు.. చెప్పరాని గోసలు వాళ్లయి. పత్తి చెట్ల కింద సంటి పిల్లలను వేసి పత్తేరె.. ప్యాద కూలీలు ఎందరో! వాళ్లు పొద్దంతా కష్టపడి ఇంటికి పైసలు తెస్తే.. ఏనంగనో చూసి ఎత్కపోయి తాగుడుకు తగలవెట్టే వాళ్లు చాలా మందే ఉంటరు. ఇంటికాడ సకులం సగవెట్టి.. చేనుకాడ నడుమొంచి పనిచేసే మహిళలను పాపం అనే వారేరి? అందరూ‘ఆ..ఆడోళ్ల పనేమున్నది అల్కటి పని. బలువు పని మేమే చేస్తమనే’ మొగొళ్లేనాయే!

సర్కారు ఆలోచించాలె

తెలంగాణ సర్కారన్న ఎవుసం చేసే మహిళల చెమట కష్టం గుర్తించాలి. దశాబ్ది ఉత్సవాల్లో జూన్13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ మహిళా ఉద్యోగులను ఎంపిక చేసి సన్మానం చేసినట్టే.. ఎవుసంకు ఎన్నుబొక్క లెక్క ఉన్న ఉత్తమ మహిళలను, మహిళా కూలీలనూ సన్మానించాలి. ఏ దీమా లేని మహిళా కూలీలకు ఉచిత ప్రమాద బీమానైనా కల్పించాలి. జీఎస్​డీపీలో ఎవుసం వాటా మూడు రెట్లు పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. అందులో మహిళల శ్రమ ఉన్నదన్న ముచ్చట యాది మర్వొద్దు కదా!.

- కాశెట్టి కరుణాకర్​