- నోటరీ డాక్యుమెంట్లపై స్పెషల్ డ్రైవ్
- స్టాంప్ డ్యూటీ తీసుకుని వ్యాలిడేట్ చేయనున్న సర్కారు
- రాష్ట్రంలో ఇకపై ఈ-రిజిస్ట్రేషన్లు!
- అన్నిరకాల అగ్రిమెంట్లు ఆన్లైన్లోనే
- సినీ హీరోల యాడ్స్, మూవీల విషయంలోనూ అమలు
హైదరాబాద్, వెలుగు: నోటరీ చేసుకుని రిజిస్ట్రేషన్ కాని డాక్యుమెంట్లపై రాష్ట్ర సర్కారు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. రిజిస్ట్రేషన్ చేసుకోని డాక్యుమెంట్లపై స్టాంప్ డ్యూటీ తీసుకుని, ఆ డాక్యుమెంట్లను వ్యాలిడేట్ చేయాలని భావిస్తున్నది. దీంతో ప్రభుత్వానికి రాబడితోపాటు ఆ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్లను కోర్టుల్లో ఉపయోగపడేలా చేయనున్నట్లు తెలిసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్, సేల్ డీడ్‌తో పాటు తదితర ఎవిడెన్సులతో నోటరీ చేసుకుంటారు. అలా నోటరీ చేసుకుని రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న డాక్యుమెంట్లు లక్షల్లో ఉన్నాయి. అటువంటి వాటికి పెనాల్టీ లేకుండా, ట్రాఫిక్ చలాన్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లుగానే నోటరీ డాక్యుమెంట్ల వ్యాలిడేషన్పైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో అనధికారికంగా జరిగే అగ్రిమెంట్లను కూడా అథరైజ్డ్ చేయాలని సర్కారు భావిస్తున్నది.
వెబ్సైట్ నుంచే అప్లికేషన్లకు చాన్స్
ఇటీవల మహారాష్ట్రలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్టడీ చేసి వచ్చారు. దీని ఆధారంగా తెలంగాణలోనూ మార్పులు చేయాలని నివేదించారు. మహారాష్ట్రలో ఉన్నదాని ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో లీజు అగ్రిమెంట్లు, రెంటల్ అగ్రిమెంట్లు, కొనుగోళ్లు, అమ్మకాలు, ఇతర పనుల ఒప్పందాలకు సంబంధించి ఈ– రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నది. ఇందుకు ప్రత్యేక ఆప్షన్‌ను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలా చేయడంతో ప్రభుత్వానికి ఆదాయంతోపాటు వినియోగదారులకూ ఒక అథరైజ్డ్ డాక్యుమెంట్‌ను ఇచ్చినట్లు అవుతుందని భావిస్తోంది. ఫలితంగా అగ్రిమెంట్లు చేసుకునేవారి మధ్య ఏమైనా తగాదాలు, వివాదాలు వచ్చినా పరిష్కరించుకునే వెసులుబాటు కలగనుంది. ఇలాంటి అగ్రిమెంట్లు మాత్రమే కాకుండా సినిమా హిరోలు, ఆర్టిస్టులు వివిధ కంపెనీలతో చేసుకునే అడ్వర్టయిజ్మెంట్ ఒప్పందాలకుకూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
స్టాంప్ డ్యూటీ కిందకు కార్పొరేట్ ప్రకటనలు
ఇప్పటి వరకు సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, డెవలప్మెంట్, లీజు అగ్రిమెంట్లు వంటి పత్రాల ద్వారా స్టాంప్ డ్యూటీ ఎక్కువగా వస్తోంది. ఇందులో దాదాపు 70 శాతం ఆదాయం విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల ద్వారానే సమకూరుతోంది. పుస్తకాల కాపీరైట్లు, ప్రకటనలు, హీరోల ఒప్పందాలు, కార్పొరేట్ ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ప్రకటనల ఒప్పందాల వంటివి అనధికారికంగా జరిగిపోతున్నాయి. ఇవేమీ స్టాంప్ డ్యూటీ పరిధిలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టడం లేదు. దీంతో వీటికి కూడా ఆన్లైన్లో అప్లై చేసేలా వెసులుబాటు కల్పించి, ప్రభుత్వానికి కొంత ఫీజు తీసుకుని అథరైజ్డ్ చేయాలని చూస్తున్నది. ఇందుకు యూజర్ ఫ్రెండ్లీ మాదిరిగా రిజిస్ట్రేషన్ సైట్లో ఆప్షన్లు ఇవ్వాలని భావిస్తోంది.