- స్పీడ్‌గా కొనసాగుతున్న బ్యాంక్ లింకేజీ లోన్ల మంజూరు
- టార్గెట్ రూ. 18 వేల కోట్లు.. ఇప్పటికే ఇచ్చింది రూ. 15 వేలకోట్లపైనే..
- మార్చి చివరి నాటికి మిగతా లక్ష్యం చేరుకునేలా ప్రయత్నాలు
- టార్గెట్‌కు మించి లోన్ల మంజూరుతో ఫస్ట్ ప్లేస్‌లో మహబూబాబాద్
- రెగ్యులర్‌గా వడ్డీ తిరిగి వస్తుండడంతో లోన్లు తీసుకునేందుకు మహిళల ఆసక్తి
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీని స్పీడప్ చేశారు. 2024 - – 25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 3,56,185 గ్రూపులకు రూ.18,048 కోట్లు రుణంగా ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకోగా ఈ నెల 6 నాటికి 15,408 కోట్లు మంజూరు చేశారు.
ఈ ఏడాది మార్చి 31 నాటికి మిగతా టార్గెట్‌ను సైతం చేరుకునేందుకు సెర్ప్ సిబ్బంది, బ్యాంకు ఆఫీసర్లు, గ్రామాల్లో సీఏలు లోన్ సాంక్షన్ ప్రాసెస్‌ను వేగవంతం చేశారు. రుణాల మంజూరులో టార్గెట్‌ను మించి మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, 67 శాతంతో అసిఫాబాద్ జిల్లా లాస్ట్‌లో ఉంది.
వడ్డీ లేని రుణాలపై మహిళల ఆసక్తి
వచ్చే ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ‘మహిళా శక్తి’ స్కీమ్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందజేస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగా రుణాలకు సంబంధించి వడ్డీని బకాయి పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో 2018లో చివరిసారిగా రుణాల వడ్డీని చెల్లించింది.
ఆ తర్వాత ఐదేండ్లలో రూ. 3 వేల కోట్లకుపైగా బకాయిలు ఉంటే కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంది. దీంతో ఆ వడ్డీ భారాన్ని మహిళలే భరించాల్సి వచ్చింది. ఈ కారణంతో మహిళలు లోన్లు తీసుకునేందుకు వెనుకాడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో లోన్ల కోసం మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో సంఘంలో 10 మంది చొప్పున ఉండగా గ్రూప్ రీపేమెంట్ రికార్డును బట్టి ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. 5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళలు తమ పిల్లలకు ఉన్నత చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, చిరువ్యాపారాల విస్తరణకు వినియోగిస్తున్నారు. రుణాలు తీసుకున్న మహిళలు ఎవరైనా చనిపోతే.. గతంలో ఆ గ్రూపు సభ్యులంతా కలిసి బకాయి చెల్లించాల్సి వచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సదరు మహిళ తీసుకున్న రుణం మాఫీ అయ్యేలా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చింది.
ఇప్పటివరకు 1.75 లక్షల గ్రూప్‌లకు లబ్ధి
సెర్ప్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 4,66,170 స్వయం సహాయక సంఘాల్లో 46.61 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో గతంలో రుణాలు తీసుకుని చెల్లించడం పూర్తయిన, పూర్తి కావొస్తున్న గ్రూపులతో పాటు కొత్త గ్రూపులకు కలిపి మొత్తం 3,56,185 గ్రూపులకు రూ.18,484 కోట్లును బ్యాంకు లింకేజీ రుణాలుగా ఇవ్వాలని సెర్ప్ ఆఫీసర్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఇందులో ఈ నెల 6 నాటికి 1,75,416 గ్రూపులకు రూ. 15,408 కోట్లు రుణాలుగా మంజూరు చేయడంతో రూ.85 శాతం టార్గెట్ పూర్తయింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మిగతా టార్గెట్‌ను సైతం పూర్తి చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
మహబూబాబాద్ ఫస్ట్, రంగారెడ్డి సెకండ్
రుణాల పంపిణీలో మహబూబాబాద్ జిల్లా టార్గెట్ పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జిల్లాలో రూ.495 కోట్లు రుణాలుగా ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 5,714 గ్రూపులకు రూ. 512 కోట్ల లోన్లు మంజూరు చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో రూ.850 కోట్ల టార్గెట్‌కు రూ.807 కోట్లు పంపిణీ చేయడంతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
ఇక నిజామాబాద్ జిల్లాలో రూ.1,228 కోట్లకు రూ.1,155 కోట్లు, నిర్మల్‌లో రూ.484 కోట్లకు రూ.445 కోట్లు, ములుగులో రూ.223 కోట్లకు రూ.204 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.513 కోట్లకు రూ.467 కోట్లు, జనగామలో రూ. 476 కోట్లకు రూ.431 కోట్లు మంజూరు అయ్యాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.434 కోట్లకు గాను రూ. 316 కోట్లు, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో రూ. 227 కోట్లకు రూ.152 కోట్ల లోన్ల మంజూరుతో చివరి స్థానంలో నిలిచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా 21,018 మహిళా గ్రూపులకు ఈ నెల 6 నాటికి రూ.2,182 కోట్లు మంజూరు చేశారు.