
- పంపిణీకి రెడీ అవుతున్న సివిల్ సప్లయ్స్ శాఖ
- బియ్యం, నూక శాతంపై మిల్లర్లతో చర్చలు కొలిక్కి
- ప్రతినెలా 1.75 లక్షల నుంచి 2 లక్షల టన్నుల బియ్యం అవసరం
- ఏడాదికి అవసరాలు 22 లక్షల టన్నులకు పైగానే..
- వానాకాలం సేకరించిన సన్నవడ్లు 24.18 లక్షల టన్నులు
- 6 నెలల వరకు బేఫికర్.. మిగతా అవసరాలకు వచ్చే యాసంగి ధాన్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు పేద వర్గాలకు రేషన్‌పై సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఆ దిశగా కసరత్తు మొదలెట్టింది. మిల్లర్లతో చర్చలు జరిపి సన్నబియ్యం మిల్లింగ్ చకచకా జరిగేలా చూస్తున్నది. ఇప్పటికే 3 లక్షల టన్నుల మిల్లింగ్ చేసిన సన్నబియ్యం మిల్లింగ్ చేసి పంపిణీకి సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
ఇప్పటికే బియ్యం, నూక శాతంపై రాష్ట్రంలోని రా రైస్ మిల్లర్లతో చర్చలు కొలిక్కి రావడంతో రేషన్ పంపిణీకి అవసరమైన సన్న బియ్యాన్ని వేగంగా మిల్లింగ్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం ఉన్న 90 లక్షలకుపైగా రేషన్ కార్డులకు నెలకు 1.75 లక్ష టన్నుల సన్న బియ్యం అవసరం ఉంటుంది. వన్ నేషన్ –వన్ రేషన్ స్కీమ్, కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు.. ఇలా అన్ని కలిపినా నెలకు 2 లక్షల టన్నులలోపే అవసరమవుతాయని అంచనా వేస్తున్నది.
బోనస్‌తో సేకరించిన ధాన్యం మిల్లింగ్
గత వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి రూ.12,503 కోట్ల విలువైన 53.91 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. రైతులకు రూ.12,389 కోట్లు ఇప్పటికే చెల్లించింది. అందులో దొడ్డు రకాలు 29.73 లక్షల టన్నులు కాగా, సన్న ధాన్యం 24.18 లక్షల టన్నులు ఉన్నాయి. ఇప్పటికే రైతులకు దాదాపు 900 కోట్లకు పైగా బోనస్ చెల్లించింది. ఇలా సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, పేదలకు రేషన్ ద్వారా పంపిణీ చేయనున్నారు.
ఈ వానాకాలం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16.20 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధమవుతుంది. ఇందులో ఇప్పటికే 3 లక్షల టన్నుల సన్నబియ్యం మిల్లింగ్ పూర్తయింది. రాబోయే రెండు నెలల్లో మరో 5 లక్షల టన్నులు సిద్ధం చేస్తున్నారు.
గత సీజన్ బియ్యంతో 6 నెలల వరకు రేషన్..
రాష్ట్రంలో సన్న బియ్యం కోసం ఏడాదికి 34 లక్షల టన్నుల సన్నాల అవసరం ఉంటుంది. అయితే గత వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 24.18 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16.20 లక్షల టన్నుల బియ్యం మాత్రమే రానున్నాయి. ఈ బియ్యం 6 నెలల వరకు రేషన్ పంపిణీకీ సరిపోయే అవకాశం ఉన్నది. ఈ యాసంగి సీజన్లో మరో 10 లక్షల టన్నుల సన్న ధాన్యం మిల్లింగ్ చేస్తే ఏడాదికి సరిపోను సన్న బియ్యం అందుబాటులోకి వస్తుంది.
ఈ యాసంగిలోనూ భారీగా వరి సాగు జరుగుతున్న నేపథ్యంలో సన్న ధాన్యాన్ని సర్కారు మళ్లీ బోనస్ ఇచ్చి మరీ సేకరించనున్నది. ఈ రెండు సీజన్లు కలుపుకుంటే రాష్ట్రంలో అవసరాలకు సరిపోనూ ఇంకా మిగిలే అవకాశం ఉంటుందని సివిల్ సప్లయ్స్ అధికారులు అంటున్నారు.
ALSO READ : 'ఆత్మీయ భరోసా' అర్హుల గుర్తింపు.. ఫిబ్రవరి 2లోగా పూర్తి
మిల్లింగ్ వేగవంతం చేస్తున్నాం..
రాష్ట్రంలో మిల్లర్లతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ మిల్లింగ్‌ను వేగంతం చేస్తున్నాం. గతంలో 48 లక్షల టన్నుల ధాన్యం మిల్లింగ్ పెండింగ్‌లో ఉంటే 31.85 లక్షల టన్నులు మిల్లింగ్ చేయించాం. 29.65 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించాం. 2.25 లక్షల టన్నులు జనవరిలోనే సేకరించినం. 48 లక్షల టన్నుల పెండింగ్‌ను నేడు కేవలం 90 వేలకు తగ్గించగలిగాం. రేషన్ పంపిణీ కోసం సన్న ధాన్యం మిల్లింగ్ చేసి 3 లక్షల టన్నులు సిద్ధం చేశాం.
ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం ప్రకటించినా సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినం. వచ్చే సీజన్లో సన్న ధాన్యం సేకరించి రాష్ట్ర అవసరాలకు తగిన సన్న బియ్యం ఏర్పాట్లు చేస్తాం.
- డీఎస్ చౌహాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్