ఔట్​సోర్సింగ్ ​ఉద్యోగులకు స్పెషల్​ కార్పొరేషన్.. ఇక సకాలంలో జీతాలు.. పీఎఫ్, ఈఎస్ఐ.. !

ఔట్​సోర్సింగ్ ​ఉద్యోగులకు స్పెషల్​ కార్పొరేషన్.. ఇక సకాలంలో జీతాలు.. పీఎఫ్, ఈఎస్ఐ.. !
  • కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు
  • ఎండీగా ఐఏఎస్​ అధికారిని నియమించే చాన్స్​ 
  • రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు 
  • ప్రభుత్వంలో ఎక్కడ ఔట్​సోర్సింగ్​​ ఉద్యోగులు అవసరమున్నా అక్కడి నుంచే రిక్రూట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్​తో  ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా.. ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. 

ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపులు, ఇతర సంక్షేమ పథకాలను పార దర్శకంగా కార్పొరేషన్​ నుంచే నిర్వహించాలని ఆలోచిస్తున్నది. దీంతో దళారుల దోపిడీని అరికట్టడంతోపాటు ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రతను కల్పించవచ్చని  భావిస్తున్నది. ఔట్​ సోర్సింగ్​ కార్పొరేషన్‌‌కు ఎండీగా సీనియర్ ఐఏఎస్ ను నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్పొరేషన్​ పూర్తిగా జీఏడీ లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనుంది. కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 8 కింద నాన్-ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్​ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.  

కొత్తగా ఏర్పాటు చేయబోయే  కార్పొరేషన్ నుంచే  రాష్ట్రంలోని అన్ని  ప్రభుత్వ శాఖలు, సంస్థల  ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయీస్​ అవసరాలు తీర్చనున్నారు.  సాధారణంగా ఇప్పుడు  ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల నియామకం జరుగుతున్నది. దీంతో ఆలస్యంగా జీతాలు, అవినీతి, అర్హత లేని వ్యక్తుల ఎంపిక వంటివి జరుగుతున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులను తొలగించి.. స్కిల్​ ఆధారంగా పారదర్శక నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.  

ఆధార్ వివరాలతో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి, వారి అర్హతలు, నైపుణ్యాలను ధృవీకరించిన తర్వాతే నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నది. నియామకాల్లో తెలంగాణ స్టేట్​ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్​, రిజర్వేషన్లు, రోస్టర్‌‌‌‌‌‌‌‌ను అనుసరించేలా ప్లాన్​ చేస్తున్నారు. కార్పొరేషన్​ ఏర్పాటు అయితే.. ఏయే శాఖల్లో ఎక్కడ ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులున్నారు?  ఏం పనులు చేస్తున్నారు ? వారి అవసరం ఎంత ? జీత భత్యాలు ఏమిటి? అనే దానిమీద ఒక క్లారిటీ వస్తుందని అధికారులు అంటున్నారు.

ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్​ సౌకర్యాలు..

కార్పొరేషన్ ఏర్పాటు అయితే జీతాల చెల్లింపుల విషయంలోనూ కీలక మార్పులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు నాలుగైదు నెలల వరకు జీతాలు అందడం లేదు. ఆయా శాఖలు నేరుగా చెల్లింపులు చేస్తున్నాయి. అయితే కార్పొరేషన్​ ఏర్పాటు అయితే.. ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్​), ఎంప్లాయీస్​ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్​ఐ) వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు అందనున్నాయి. 

జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ ద్వారా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో  మధ్యవర్తులు  ఔట్​ సోర్సింగ్​ శాలరీలో రూ.3 వేల నుంచి రూ.5 వేల కోతవేసే ఆర్థిక అవకతవకలు పూర్తిగా తొలగనున్నాయి.  ఉద్యోగుల అటెండెన్స్​ వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసే వ్యవస్థను అమలు చేయడం ద్వారా జీతాల చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూస్తారని అధికారులు చెబుతున్నారు. 

ఏపీలో ఇదే రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అక్కడి విధానాన్ని కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది.  ఈ కార్పొరేషన్ ద్వారా ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌‌‌‌‌‌‌‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.