గూడెంలో 4 దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికల్లేవ్

గూడెంలో 4 దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికల్లేవ్
  • 4 దశాబ్దాలుగా ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లేవ్
  • గిరిజనులు లేకున్నా నోటిఫైడ్​ఏరియాగా గుర్తించడం వల్లే..  
  • సర్పంచ్​ పదవితో పాటు ఐదు వార్డులు ఎస్టీలకు రిజర్వ్ 
  • స్పెషల్​ ఆఫీసర్ల పాలనలో కుంటుడుతున్న అభివృద్ధి
  • ప్రజలు ​ఆందోళలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో పల్లెల్లో సందడి మొదలైంది. రిజర్వేషన్లు అనుకూలిస్తే సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు చోటామోటా లీడర్లు రెడీ అవుతున్నారు. గ్రామాల్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల ఖర్చుల కోసం ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఇలా పల్లెల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. కానీ, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందడి కనిపించడం లేదు. ఇప్పుడే కాదు, దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇదే పరిస్థితి. 

గిరిజనులు లేకున్నా నోటిఫైడ్​గా

ఏడున్నర దశాబ్దాల కిందట జరిగిన ఓ పొరపాటు పంచాయతీ ఎన్నికలకు శాపంగా మారింది. గూడెంలో గిరిజనులు లేకపోయినప్పటికీ 1950లో ఈ గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 1987 నుంచి సర్పంచ్​తో పాటు పదింటిలో ఐదు వార్డులను ఎస్టీలకు రిజర్వ్​ చేసింది. గ్రామంలో 1800 పైచిలుకు జనాభా ఉన్నప్పటికీ అందరూ గిరిజనేతరులే. ఊర్లో ఒక్క గిరిజన కుటుంబం కూడా లేదు.

1920 నుంచి ఇక్కడ గిరిజనులు నివసించినట్టు ఎలాంటి రికార్డుల లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేవారు కరువయ్యారని చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చిన ప్రతిసారి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు కూడా దాఖలు కావడం లేదు. ఈ కారణంగా దాదాపు 37 ఏండ్లు నుంచి పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు.

స్పెషల్ ఆఫీసర్ల పాలనలో

గూడెంలో పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో స్పెషల్​ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు లేకపోవడం వల్ల గ్రామంలోని సమస్యల పరిష్కారం గురించి పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేవారు కరువయ్యారు. దీంతో దశాబ్దాలుగా గ్రామాభివృద్ధి కుంటుపడడమే కాకుండా ప్రజలు కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల కిందట నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్​సైతం శిథిలావస్థకు చేరుకుంది.

పట్టించుకోని ప్రభుత్వాలు

తమ గ్రామాన్ని నోటిఫైడ్​ ఏరియా నుంచి తొలగించి పంచాయతీ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నారు. రిజర్వేషన్లు మార్చాలంటూ పలుమార్లు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.

అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేయాలనే పట్టుదలతో పలువురు ఉన్నప్పటికీ వారికి నిరాశే మిగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన నేపథ్యంలో ఈసారైనా గూడెంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.  

ఎలక్షన్లు లేక అభివృద్ధి దూరం

పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో గూడెం గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మా ఊర్లో ఒక్క గిరిజనుడు కూడా లేకపోయినప్పటికీ ప్రభుత్వం నోటిఫైడ్​ ఏరియాగా ప్రకటించింది. దీంతో మా గ్రామానికి తీరని అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే నాన్ ఏజెన్సీగా ప్రకటించి ఎన్నికలు.నిర్వహించాలి.  

- వల్లంభట్ల శ్రీనివాస్   (మాజీ పర్సన్ ఇన్​చార్జి)  

1920 నుంచి గిరిజనులు లేరు.. 

1920 నుంచి ఒక్క గిరిజనుడు కూడా గూడెంలో నివసించినట్లు రికార్డ్స్​లో లేదు. గవర్నర్​తోపాటు ఎంతో మంది మంత్రులను, రాజకీయ నాయకులను కలిసినా ప్రయోజనం లేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. గ్రామంలో సరైన రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. అభివృద్ధి అసలే లేదు.    - బిళ్లకూరి బాపు