రిజిస్ట్రేషన్లు ధరణి తరహాలోనే!
పాత పద్ధతి అని హైకోర్టుకు చెప్పి.. కొత్త పద్ధతిలో ప్రారంభించిన సర్కార్
స్లాట్ బుకింగ్ కు ఇబ్బందులు.. ఉదయం నుంచే జనం క్యూ
మధ్యాహ్నం 2 గంటలకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభించిన సీఎస్
ఎక్కువ మంది ప్రయత్నించడంతో సర్వర్ డౌన్.. తొలిరోజు 37 స్లాట్లే బుక్
ఎల్ఆర్ఎస్ భూములకే రిజిస్ట్రేషన్లు.. పీటీఐఎన్ నంబర్ కూడా తప్పనిసరి
రైటర్లు, స్టాంప్ వెండర్లకు మంగళం.. రోడ్డున పడిన 10 వేల కుటుంబాలు
ఒక్కో ఆఫీసులో రోజుకు 24 డాక్యుమెంట్ల పరిమితిపై రియల్టర్ల అసహనం
హైదరాబాద్, జగిత్యాల, వెలుగు: పాత పద్ధతిలోనే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తామని హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త విధానానికి తెర లేపింది. ధరణి పోర్టల్ తరహాలోనే రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ ను మార్చేసింది. స్లాట్ బుకింగ్‌లో కూడా మార్పులు చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్ ఓపెన్ చేయగానే ‘నాన్ అగ్రికల్చర్’ అని కనిపిస్తోంది. అందులో ఫోన్ నంబర్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని స్లాట్ బుకింగ్ కోసం లాగిన్ కాగానే ధరణి లో కనిపించినట్లుగానే స్లాట్ బుకింగ్, అప్లై ఫర్ పీటీఐఎన్ నంబర్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్, నో యువర్ ఎస్ఆర్ఓ, స్లాట్ బుకింగ్ ఫర్ నాన్ ఆధార్ అనే ఆప్షన్లు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తవగానే మున్సిపల్, పంచాయతీ రికార్డుల్లో పేరు మారేలా ఆటో మ్యుటేషన్ కోసం స్లాట్ బుకింగ్ టైంలోనే పీటీఐఎన్ నంబర్ ఎంట్రీ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇంటిపై ఉండే ఈ నంబర్ ఎవరికైనా లేనట్లయితే అప్లై చేసుకునేందుకు అదే పోర్టల్ లో అవకాశం కల్పించారు.
ఉదయం నుంచి క్యూ.. మధ్యాహ్నం ప్రారంభించిన సీఎస్
రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద స్లాట్ బుకింగ్ కోసం జనాలు మీ సేవా సెంటర్లు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, డాక్యుమెంటరీ రైటర్ల వద్ద క్యూ కట్టారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు సీఎస్ సోమేశ్‌కుమార్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభించారు. ఈ విషయం తెలియక జనం ఉదయం నుంచే బారులు తీరారు. 3 నెలల నుంచి పెండింగ్‌లో ఉండడం, ప్రతి ఆఫీసులో రోజుకు 24 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తారని తెలియడంతో ఎక్కువ మంది తరలివచ్చారు. కానీ సాయంత్రం 4 గంటల వరకు స్లాట్‌బుకింగ్ ఆప్షన్ కనిపించలేదు. ఆ తర్వాత ఆప్షన్ కనిపించినా సర్వర్ పని చేయలేదు. ఒక్కసారిగా చాలా మంది స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగి డౌన్ అయింది.
వీఎల్టీ నంబర్ ఉంటేనే స్లాట్ బుకింగ్
ఎల్ఆర్ఎస్ అయిన ఖాళీ స్థలాలకు ప్రభుత్వం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) విధిస్తోంది. కేవలం ఎల్ఆర్ఎస్ అయిన ఓపెన్ ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించిన సర్కార్.. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో వీఎల్టీ నంబర్ అడుగుతోంది. ఈ నంబర్ లేని ప్లాట్లకు స్లాట్ బుకింగ్ చేయడం కుదరడం లేదు. దీంతో రాష్ట్రంలోని 25 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలనే జనం కోరుతున్నారు.
స్కెచ్ మ్యాప్ లేకుండానే..
ప్లాట్, బిల్డింగ్ విస్తీర్ణంతోపాటు, దాని బౌండరీస్, పొడవు, వెడల్పులు తెలిపే మ్యాప్ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉండేది. కానీ కొత్త విధానంలో దాన్ని అడగడం లేదు. ఇది లేక పోతే పొరుగు వారితో సరిహద్దు, విస్తీర్ణం సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కుదరదని పలువురు డాక్యుమెంట్ రైటర్లు అంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తమ వారి తరఫున ఇక్కడి కుటుంబ సభ్యులు ఎస్పీఏ ఫామ్ ద్వారా ఆస్తుల అమ్మకం, కొనుగోలు చేయడానికి వీలుండేదని, కానీ కొత్త విధానంలో ఆ అవకాశం లేదని పేర్కొంటున్నారు. కొనుగోలుదారులు చెల్లించిన డబ్బులకు సంబంధించిన చెక్కులు, డీడీలు, నగదు వివరాలు డాక్యుమెంట్ లో పేర్కొనే వారని, ఇప్పుడు ఆ వివరాలు పొందుపరచకపోవడం వల్ల భవిష్యత్ లో లీగల్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకోవడం అనేది ఇక కుదరదని చెబుతున్నారు.
రోజుకు 24 రిజిస్ట్రేషన్లేనా?
3 నెలలుగా నాన్‌అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటిదాకా సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అంచనా. పెళ్లిళ్లు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఉన్నత చదువులకు ఫీజుల కోసం అప్పులు పుట్టక ఆస్తిని అమ్మకానికి పెట్టినవాళ్లు హైరానా పడ్డారు. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూశారు. వీరంతా శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు క్యూ కట్టారు. కానీ ప్రభుత్వం రోజుకు ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో 24 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగేలా, ఆ మేరకే స్లాట్ బుకింగ్ కు అవకాశం ఇవ్వడంతో నిరాశకు గురయ్యారు. ప్రస్తుత రద్దీ దృష్ట్యా స్లాట్స్ సంఖ్య పెంచాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరుతున్నారు.
ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు..
నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లకు ఆధార్ నంబర్, కులం, కుటుంబ సభ్యుల వివరాలుఅడగొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే సెప్టెంబర్ వరకు నిర్వహించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగకున్నా.. అమ్మకం, కొనుగోలుదారుతోపాటు సాక్షుల ఆధార్ నంబర్లు, జిరాక్సులు అడిగేవారు. ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ఆధారంగా డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టే అవకాశం ఉండేదని, ఆధార్లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడమెలా అని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ అనుమానం వ్యక్తం చేశారు. కొత్త స్లాట్ బుకింగ్ లో ఆధార్, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, కులం కాలమ్స్ ను తప్పనిసరి చేయలేదు. కేవలం ‘ఆప్షనల్’గానే పెట్టారు.
చలాన్ తేదీలను పొడిగిస్తరా?
గతంలో రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన చలాన్లకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది. 3 నెలలుగా రిజిస్ట్రేషన్లే లేవు. ఇప్పటికే చివరి తేది దగ్గర పడిన చలాన్లపై ఎలాంటి క్లారిటీ లేదు. మరో మూడు నెలలు వ్యాలిడిటీ పెంచాలని జనం డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో చెల్లించిన చలాన్లు ఇప్పుడు చెల్లుబాటు అవుతాయని, వీరంతా స్లాట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందని ఎస్ఆర్వో వర్గాలు చెబుతున్నాయి.
రైటర్లకు, వెండర్లకు నో వర్క్
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇన్నాళ్లు కీలకంగా పనిచేసిన డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల వ్యవస్థకు ప్రభుత్వం కొత్త విధానం ద్వారా మంగళం పాడింది. కొత్త విధానంతో 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఉప్పల్ కు చెందిన స్టాంప్ వెండర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ లేని వారి విషయంలో త్వరలోనే నిర్ణయం: సీఎస్
రిజిస్ట్రేషన్లకు పాత చార్జీలే అమలులో ఉన్నాయని చీఫ్‌సెక్రటరీ సోమేశ్ కుమార్ చెప్పారు. శుక్రవారం సెక్రటేరియట్లో నాన్ అగ్రికల్చరల్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సిస్టంను సీఎస్ ప్రారంభించారు. రిజిస్టర్ చేయాల్సిన ప్రాపర్టీ వివరాలు నమోదు చేయగానే సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీ, స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీల చెల్లింపు వివరాలు జనరేట్ అవుతాయని చెప్పారు. ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజుకు 24 స్లాట్లను కేటాయిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ ను https://registration.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ కు టీపీఐఎన్, పీటీఐఎన్ అసెస్‌మెంట్ నంబర్లను ఫీడ్ చేయాల్సి ఉంటుందని, ఇవి లేనోళ్లు లోకల్ బాడీస్‌లో అప్లై చేస్తే 2 రోజుల్లో పీటీఐఎన్ నంబర్‌ను జారీ చేస్తారన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి అనుగుణంగా కొనుగోలుదారులు, అమ్మకందారులు, సాక్షులు తమ ఐడీ ప్రూఫ్‌లతో హాజరుకావాలని సీఎస్ చెప్పారు. ఆధార్ నంబర్ ఇవ్వని వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే మ్యుటేషన్ జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం సేల్, మార్టిగేజ్ విత్ పొసెషన్, మార్టిగేజ్ వితవుట్ పొసెషన్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, గిఫ్ట్, డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ వితవుట్ పొసెషన్ తదితర సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏవైనా సమస్యలుంటే 1800 599 4788 నంబర్ కు ఫిర్యాదు చేస్తే ఐటీ శాఖ పరిష్కరిస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ లేని వారి విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు అప్లై చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఈ–పాస్ బుక్ జారీ అవుతుందని, 7 నుంచి 10 రోజుల్లోపు రెగ్యులర్ పాస్ బుక్ ఇస్తామని వెల్లడించారు. స్లాట్ బుకింగ్ సర్వీస్‌ను లాంచ్ చేసిన 15 నిమిషాల్లోనే 2 స్లాట్లు బుక్ అయినట్లు సీఎస్ ఆఫీసు తెలిపింది. శుక్రవారం సాయంత్రం దాకా మొత్తం 37 స్లాట్లు బుక్ అయినట్లు చెప్పింది. ఫీజుల రూపంలో రూ.85 లక్షల వచ్చినట్లు వెల్లడించింది.
స్లాట్ ఇప్పుడు తప్పనిసరి
ఉదయం నుంచి జనాల తాకిడి పెరిగింది. కానీ వచ్చిన వారిలో స్లాట్ లేనివారే ఎక్కువగా ఉన్నా రు. స్లాట్ బుక్ చేసుకుని రావాలని చెబుతున్నాం. గతంలోనూ స్లాట్ బుకింగ్ విధానం ఉంది. కానీ ఇప్పుడు తప్పనిసరిగా స్లాట్ ఉన్నోళ్లకే రిజిస్ట్రేషన్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. గతంలో 15 నుంచి 20 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో స్లాట్లు ఆన్ లైన్ లో ఉన్నాయి.
– అశోక్ కుమార్, సబ్ రిజిస్ట్రార్, సరూర్ నగర్
పీటీ లేనోళ్లు స్లాట్ అడుగుతున్నరు
స్లాట్ బుక్ చేసుకోవాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ (పీటీ) వివరాలు కావాలి. ఉదయం నుంచి జనాలు వస్తున్నా రు. కానీ ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ అడిగితే లేదంటున్నారు. దీంతో స్లాట్ బుక్ చేయలేని పరిస్థితి. సాయంత్రం దాకా 30 మందికిపైగా స్లాట్ బుకింగ్ వస్తే.. అందులో సగం మందికిపైగా ప్రాపర్టీ ట్యాక్స్ వివరాల్లేవు.
– మొహీద్, మీ సేవ నిర్వాహకుడు
సైట్ ఓపెన్ కాలే
4 నెలల కిందట రెం డు ప్లా ట్లకు అడ్వాన్స్ ఇచ్చిన. ఇప్పుడు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తరని పేపర్లో చూసిన. దీంతో పొద్దుగాల్నే వచ్చిన. రిజిస్ట్రేషన్
ఆఫీసులో స్లాట్ బుక్ చేద్దామంటే అసలు సైటే ఓపెన్ అయిత లేదు.
– కుర్మా మహిపాల్ రెడ్డి, జగిత్యాల
For More News..