- హాట్ టాపిక్ గా మారిన సీఎం టూర్
- సారు వెంటే 13 మంది మంత్రులు
- పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్
- 600 కార్ల కాన్వాయ్ తో 2 రోజుల పర్యటన
- వాటిలో సర్కారు వాహనాలు కూడా?
- పార్టీ జెండాలు కట్టి తీసుకెళ్లి ర్యాలీ!
- పండరీపూర్ దర్శనానికే అయితే ఫ్యామిలీతో వెళ్లొచ్చు
- గతంలో కుటుంబంతో తమిళనాడు వెళ్లొచ్చిన కేసీఆర్
- ఈ సారి ఇంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నట్టు..?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రకు తరలి వెళ్లింది. 13 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా వెళ్లడంతో పలుచోట్ల అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలకు రెండురోజుల పాటు బ్రేక్ పడింది. పుణ్యక్షేత్రాల దర్శనానికి గతంలో కుటుంబంతో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి ఈ సారి ఇందుకు భిన్నంగా మందీ మార్బలంతో 600 కార్ల భారీ కాన్వాయ్ లో పండరీపూర్ దర్శనానికి బయల్దేరడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ మొదలైంది. నిన్న హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్ రాత్రి సోలాపూర్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో బస చేశారు. ఇవాళ ఉదయం అక్కడి నుంచి పండరీపూర్ విఠలేశ్వరుడి దర్శనానికి అదే హంగు, ఆర్భాటాలతో వెళ్లారు.
ఏడాదిన్నర క్రితం కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో తిరుచ్చిరాపల్లి వరకు వెళ్లిన సీఎం అక్కడి నుంచి శ్రీరంగం వెళ్లారు. అనంతరం చెన్నయ్ బయల్దేరి వెళ్లి సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. తర్వాత చెన్నయ్ నుంచి అదే విమానంలో హైదరాబాద్ తిరిగి వచ్చారు. అప్పుడు సీఎం వెంట సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ,మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, సమీప బంధువు సంతోష్ తదితరులున్నారు. కానీ ఈ సారి కేసీఆర్.. పండరీపూర్ దర్శనానికి భారీ కాన్వాయ్ తో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా వెంట తీసుకొని వెళ్లడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న చర్చ మొదలైంది.
అసలు ఉద్దేశమిదేనా..?
20 ఏండ్ల క్రితం 2 వేల కార్లతో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి దేశం దృష్టిని మళ్లించారని, ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని సంకేతాలు ఇచ్చేందుకే ఈ టూర్ ఏర్పాట్లు చేసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి సోలాపూర్ చేరుకున్న కేసీఆర్.. అక్కడి మాజీ ఎంపీ ధర్మన్న సాధుల్ తో భేటీ అయ్యారు. చేనేత కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో పాగా వేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. భారీ కాన్వాయ్ ప్రదర్శన ద్వారా అక్కడున్న మిగతా ఓటర్లలో భరోసా కల్పించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ALSO READ:అమ్మతోడు నిజం : కిలో ఉల్లి మూడు రూపాయలు
పడకేసిన పాలన
రాజు వెడలె రవితేజములలరగ అన్నట్టుగా.. సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్ తో బయల్దేరటం.. ఆయన వెంట 13 శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులు వెళ్లడంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ మంత్రి కేటీఆర్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, హోం మంత్రి మహమూద్ అలీ మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. మిగతా వారంతా కేసీఆర్ వెంటే ఉన్నారు.