పరిష్కారం దిశగా ధరణి సమస్యలు

  • జిల్లాలో స్పెషల్ ​డ్రైవ్​ షురూ
  • ప్రతి మండలానికి రెండు టీమ్​లు
  • పెండింగ్​ దరఖాస్తులు 7,250

మంచిర్యాల, వెలుగు: ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 1 నుంచి 9 వరకు జిల్లావ్యాప్తంగా స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తోంది. ధరణి పోర్టల్​అమల్లోకి వచ్చిన తర్వాత అనేక భూ సమస్యలు తెరపైకి వచ్చాయి. ఖాతా, సర్వేనంబర్లు మిస్సింగ్, తప్పులు, పట్టాదారు పేర్లు, ఫొటోల్లో తప్పలు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టా, అసైన్డ్​ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు వంటి తప్పులు దొర్లాయి. 

అలాగే మ్యుటేషన్లు, సక్సెషన్, నాలా, జీపీఏ, పీవోబీ, కోర్టు కేసులు, పాస్ ​బుక్​ డేటా కరెక్షన్​తదితర దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ధరణి పోర్టల్​ టీఎం 33 మాడ్యుల్స్​లో దరఖాస్తులు చేసుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించకపోవడంతో బాధితులు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో పెండింగ్​ ఉన్న దరఖాస్తులను స్పెషల్​ డ్రైవ్​లో డిస్పోజ్ చేయాలని సూచించింది. 

కలెక్టర్​7 రోజుల్లో, అడిషనల్​ కలెక్టర్​3 రోజుల్లోగా..

జిల్లాలో 7,250 అప్లికేషన్లు పెండింగ్​ఉన్నాయి. వీటి పరిష్కారానికి సంబంధించి గతంలో కలెక్టర్​కు మాత్రమే పవర్స్​ఉండగా.. ప్రస్తుతం ఆర్డీఓలు, తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చారు. మ్యుటేషన్​, సక్సెషన్, పీఓబీ సమస్యలు, సెమీ అర్బన్​ ఏరియాలో పట్టా దారు పాస్​బుక్​ల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాస్​బుక్​ల జారీ, ఇండ్లు, నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్​ వంటి అధికారాలను కలెక్టర్​కు ఇచ్చారు. కలెక్టర్​7 రోజుల్లోగా, అడిషనల్​ కలెక్టర్​3 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. 

ఆర్డీఓలకు పాస్​ బుక్​ లేకుండా నాలా కన్వర్షన్, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ఎన్​ఆర్​ఐలకు సంబంధించిన సమస్యలు, కోర్టు కేసుల పరిష్కారం, డేటా కరెక్షన్స్, మిస్సింగ్​సర్వేనంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు తదితర సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించాలి. తహసీల్దార్లు పట్టా, అసైన్డ్​ భూముల విరాసత్, జీపీఏ, స్పెషల్ ల్యాండ్​ మ్యాటర్స్, ఖాతా మెర్జింగ్ ​వంటి సమస్యలను ఏడు రోజుల్లోగా క్లియర్​ చేయాలి.  

ప్రతి మండలానికి రెండు టీమ్​లు

 ధరణిలో పెండింగ్ ఉన్న​ సమస్యలను పరిష్కరించడానికి తహసీల్దార్లు, నాయబ్​ తహసీల్దార్లు, గిర్దావర్ల ఆధ్వర్యంలో ప్రతి మండలానికి రెండు టీమ్​లను ఏర్పాటు చేశారు. ఒక మండలంలో 20 గ్రామాలు ఉంటే ఒక్కో టీమ్​కు 10 గ్రామాల చొప్పున కేటాయించారు. ఈ టీమ్​లు అవసరమైతే ఫీల్డ్​ విజిట్​ చేసి రిపోర్ట్​ను అప్రూవల్​ ఇచ్చే అథారిటీ (కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​)కు అందజేస్తాయి. 

కలెక్టర్​ బదావత్​ సంతోష్​ శుక్రవారం అడిషనల్​ కలెక్టర్​ సబావత్​ మోతీలాల్​, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​ నిర్వహించి గైడ్​లైన్స్​ వివరించారు. ప్రభుత్వం విధించిన గడువులోగా పెండింగ్​ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.