ఆయిల్ పామ్​ సాగులో మ్యాట్రిక్స్​ఫెయిల్​

 ఆయిల్ పామ్​ సాగులో  మ్యాట్రిక్స్​ఫెయిల్​
  • మూడేండ్లలో 2,906 ఎకరాల్లోనే పంట సాగు
  • రైతులను మోటివేట్​ చేయడంలో విఫలం
  • చేతికొస్తున్న గెలలు.. జాడలేని పామాయిల్ ఇండస్ట్రీ
  • ఆయిల్​ఫెడ్​కు అప్పగించే యోచనలో సర్కారు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఆయిల్​పామ్​ సాగులో మ్యాట్రిక్స్​ కంపెనీ వెనుకబడింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రైతులతో పంట సాగు చేయించడంలో విఫలమైంది. ఆయిల్​పామ్​గెలలను రైతుల దగ్గరి నుంచి సేకరించడం, పామాయిల్​ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడంలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ కంపెనీని తొలగించి ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్​ ఫెడ్​కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

జిల్లాలో 2,906 ఎకరాలే..

జిల్లాలో 2021–22 నుంచి ఆయిల్​ పామ్ ​సాగుచేస్తున్నారు. ఈ బాధ్యతలను ప్రభుత్వం మ్యాట్రిక్స్​కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ భీమారం దగ్గర నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు సప్లై చేస్తోంది. అయితే గత నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 10 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా.. కేవలం 2,906 ఎకరాల్లో మాత్రమే ఆయిల్​ పామ్​ మొక్కలు నాటారు. మొదట మొక్కలు నాటిన రైతులు నిరుటి నుంచి దిగుబడి తీస్తున్నారు. ఆ గెలలను సేకరించి అశ్వాపురంలోని పామాయిల్​ ఇండస్ట్రీకి తరలిస్తున్నారు. 

జాడలేని పామాయిల్​ఫ్యాక్టరీ 

జిల్లాలోనే పామాయిల్ ​రిఫైనరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరుగుతోంది. మొదట జైపూర్​ మండల కేంద్రం శివారులోని ఐటీడీఏ నర్సరీలో పామాయిల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ఐటీ, ఇండస్ట్రీస్ ​మినిస్టర్ ​కేటీఆర్ మందమర్రి మండలం శంకర్​పల్లి సమీపంలో ప్లాంట్​ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినప్పటికీ అంతటితోనే ఆగిపోయింది. 

గత కాంగ్రెస్ ​ప్రభుత్వం ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టు కెనాల్స్​  కోసం సేకరించిన 70 ఎకరాల భూములను బీఆర్ఎస్​ సర్కారు హయాంలో మ్యాట్రిక్స్​ కంపెనీకి కేటాయించారు. ఎకరానికి రూ.15లక్షల మార్కెట్ ​రేటు చెల్లించకపోవడంతో భూ కేటాయింపులు రద్దయినట్టు సమాచారం. తాజాగా కన్నెపల్లి మండలంలో పామాయిల్​ ఇండస్ట్రీ ఏర్పాటుకు మ్యాట్రిక్స్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 

పలు కంపెనీలపై వేటు

ఆయిల్​ పామ్ ​సాగు, గెలల సేకరణ, పామాయిల్ ​ఫ్యాక్టరీల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 కంపెనీలకు ఆయిల్ ​పామ్​ సాగును అప్పగించగా.. ఇందులో నాలుగు కంపెనీలు ప్రభుత్వ లక్ష్యాలకు ఆమడదూరంలో ఉన్నట్టు తేల్చింది. 

విదేశాల నుంచి ఆయిల్​పామ్​ మొక్కలను దిగుమతి చేసుకొని నర్సరీలో పెంచడం, రైతులకు అవగాహన కల్పించి వారి భూముల్లో మొక్కలు నాటడం, సర్కారు ఇస్తున్న సబ్సిడీలను రైతులకు అందించడంతో పాటు గెలల సేకరణ, పామాయిల్​ ఫ్యాక్టరీల ఏర్పాటు వరకు ఈ కంపెనీలదే బాధ్యత. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 4.29 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను 1.56 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్​ పామ్​ సాగైంది.