![తాగునీటికి నో టెన్షన్ .. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నరాష్ట్ర సర్కార్](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-government-taking-special-measures-to-ensure-people-do-not-face-any-problem-in-drinking-water-during-summer_PpZHvROM9J.jpg)
- సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన మిషన్ భగీరథ అధికారులు
- మిషన్ భగీరథ మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో 111 హ్యాబిటేషన్ల గుర్తింపు
- అక్కడ ఉన్న నీటి లభ్యత, అవసరాలపై ఆరా
- ప్రస్తుతం వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకుని సిగింల్ ఫేస్ మోటర్లతో నీటి సరఫరాకు చర్యలు
- 77 తండాల్లోని గిరిజనుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు
మహబూబ్‌నగర్, వెలుగు : ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కార్.. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉన్నదో గుర్తించేందుకు మిషన్ భగీరథ అధికారులను రంగంలోకి దింపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి తాగునీటి కొరత ఉన్న పల్లెలను విజిట్ చేసి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పడిన కాలనీలు, 50 నుంచి 300 జనాభా కలిగిన గిరిజన తండాలను గుర్తించి, మిషన్ భగీరథ మహబూబ్ నగర్ డివిజన్ పరిధిలోకి చేర్చారు. ఆ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలను ముమ్మరం చేశారు.
111 హ్యాబిటేషన్ల గుర్తింపు..
మిషన్ భగీరథ మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో పాలమూరుతో పాటు నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో భగీరథ నీటి సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులపై పది రోజులుగా అధికారులు సర్వే చేశారు. అప్పర్ ప్లాట్లలో తాగునీటిని అందించేందుకు వ్యవసాయ బోర్లు, ట్యాంకర్లను ఏర్పాటు చేయనున్నారు. సర్వేలో భాగంగా ఈ మూడు జిల్లాల్లో 111 కొత్త హ్యాబిటేషన్లను అధికారులు గుర్తించారు. ఒక్కో నివాస ప్రాంతంలో 50 నుంచి 340 మంది జనాభా ఉన్నది.
తాగునీటి సమస్య ఉన్న నివాస ప్రాంతాలు ఏ గ్రామ పరిధిలోనివి, ఏ మండలం, జిల్లా వంటి వివరాలను సేకరించి తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 73 హ్యాబిటేషన్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 22, నారాయణపేట జిల్లాలో 16 హ్యాబిటేషన్లను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.
కొత్త వాటిలో 77 గిరిజన తండాలు
ఆఫీసర్లు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 111 కొత్త హ్యాబిటేషన్లను గుర్తించగా, అందులో 77 గిరిజన తండాలు ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 58 తండాలు ఉండడం విశేషం. కోయిల్‌కొండ మండలంలో కొత్తగా 27 హ్యాబిటేషన్లను గుర్తించగా, అందులో 23 తండాలు ఉన్నాయి. జడ్చర్లలో తొమ్మిది, నవాబుపేట, మిడ్జిల్ మండలాల్లో ఐదు తండాల చొప్పున, రాజాపూర్‌లో మూడు, మూసాపేట, అడ్డాకులలో ఒక్కొక్కటి, భూత్పూర్, దేవరకద్ర, హన్వాడలో రెండు చొప్పున, బాలానగర్‌లో ఆరు తండాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 22 ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నదని గుర్తించగా, అందులో సగం గిరిజన తండాలే ఉన్నాయి. నారాయణపేట జిల్లాలోనూ 16 హ్యాబిటేషన్లకుగాను ఎనిమిది తండాలు ఉన్నాయి.
తాగునీటికి తాత్కాలిక చర్యలు..
కొత్తగా ఐడెంటిఫై చేసిన హ్యాబిటేషన్లలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి.. ఎంతమంది జనం ఉన్నారన్న వివరాలను సేకరించి తాగునీటి సమస్యను తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దాని ఆధారంగా ఒక్కో నివాస ప్రాంతానికి తక్కువగా పది కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకుల నుంచి 40 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను నిర్మించాలని మిషన్‌భగీరథ యంత్రాంగం నిర్ణయించింది. ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని, సింగిల్ ఫేస్ మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు
తీసుకుంటున్నారు.