- సీఎంఆర్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కారు నిర్ణయం
- ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం
- తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచన
- బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు
- ధాన్యం పక్కదారి పట్టిస్తూ సీఎంఆర్ ఎగ్గొడుతున్న మిల్లర్లు
మంచిర్యాల, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణలో మిల్లర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ పాలనతో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరికొందరు వడ్లను మిల్లింగ్ చేసి, బియ్యాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు. పెద్ద ఎత్తున సీఎంఆర్ పెండింగ్ఉండడం వల్ల ప్రభుత్వానికి రూ.వేల కోట్లలో నష్టం వచ్చింది. ఈ అక్రమాలను అరికట్టాలంటే సెక్యూరిటీ డిపాజిట్కట్టినోళ్లకే సీఎంఆర్ ధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నది.
బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు..
గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ గానీ, బ్యాంక్ గ్యారంటీ గానీలేకుండానే కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. ఇద్దరు మిలర్లతో పాటు రైస్మిల్లర్స్అసోసియేషన్ ప్రెసిడెంట్ కౌంటర్ష్యూరిటీ మాత్రమే తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ముందుగా వడ్లు ఇచ్చిన తర్వాత తాపీగా ష్యూరిటీలు తీసుకున్న ఉదాహరణలు ఉన్నాయి.
ఎలాంటి పూచీకత్తు లేకుండా ధాన్యం అప్పగించడం వల్ల మిల్లర్లు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. వడ్లను పక్కదారి పట్టించడమే కాకుండా బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. పెద్ద ఎత్తున సీఎంఆర్బకాయిపడ్డప్పటికీ అప్పటి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా గడువుల మీద గడువులు పొడిగిస్తూ మిల్లర్లకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఒక సీజ న్ది మరో సీజన్లో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని మిల్లులపై తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం మినహా చట్టప్రకారం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రికవరీ యాక్ట్‌పై మిల్లర్లకు ఎలాంటి భయం లేకపోవడం వల్ల అక్రమాలకు అంతులేకుండా పోయింది. ఫలితంగా గత పదేండ్లలో సివిల్ సప్లయీస్కార్పొరేషన్ దాదాపు రూ.55 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.
ఇతర రాష్ట్రాల్లో పకడ్బందీగా..
సీఎంఆర్సేకరణలో ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ర్టాలు సెక్యూరిటీ డిపాజిట్విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. తద్వారా మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్అమల్లో ఉంది. అక్కడి మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన సీఎంఆర్ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగిస్తుంది. చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు. గడువులోపు సీఎంఆర్ఇవ్వకుండా డిఫాల్టర్లుగా మారిన మిల్లర్ల సెక్యూరిటీ డిపాజిట్నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని రికవరీ చేస్తారు. ఒడిశాలో డిఫాల్టర్‌గా మారిన మిల్లర్ల నుంచి రికవరీ చేసిన తర్వాత మొదటి ఏడాది 1:1, రెండో సంవత్సరం 1:2, మూడో యేడు 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే విధానం అమల్లో ఉంది. తద్వారా మిల్లర్లు కాస్త భయంతో వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం ముందు రెండు ప్రపోజల్స్..
మిల్లర్లను గాడిలో పెట్టడానికి సెక్యూరిటీ డిపాజిట్లేదా బ్యాంక్గ్యారంటీ విధానాలపై ప్రభుత్వం ఆలో చిస్తున్నట్టు తెలుస్తున్నది. సెక్యూరిటీ డిపాజిట్విధానాన్ని అమలు చేస్తే ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం చేసే అప్పుల భారం కొంతవరకైనా తగ్గుతుందని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ర్టవ్యాప్తంగా 3 వేలకు పైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఒక్కో మిల్లర్నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్తీసుకున్నా.. రూ.3 వేల కోట్లకు పైగా జమవుతాయి. బ్యాంక్గ్యారంటీ విధానంలో మిల్లర్లు 25 శాతం డిపాజిట్చేస్తే బ్యాంకులు మిల్లును మార్ట్గేజ్చేసుకుని వంద శాతానికి గ్యారంటీ ఉంటాయి. ఈ విధానంలో సర్కార్ దగ్గర నగదు జమ కాకుండా బ్యాంక్ గ్యారంటీ బాండ్మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం సెక్యూరిటీ డిపాజిట్వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే, ఇది ఎంత శాతం నిర్ణయించాలనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.