![హౌసింగ్ భూముల రక్షణకు ప్రహరీలు](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-government-taking-steps-to-protect-housing-lands_80si34voUh.jpg)
- సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు
- 703 ఎకరాల ల్యాండ్‌కు జీపీఆర్ఎస్ సర్వే
- జూన్ వరకు 1,353 ఎకరాలకు గోడలు
- లీజుకు తీసుకున్న కంపెనీల నుంచి18 ఎకరాలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు, దిల్ (దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఆయా భూముల విలువ వందల కోట్లు పలుకుతుండడంతో కొంతకాలంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో వాటి రక్షణకు ఆ భూముల చుట్టూ గోడలు నిర్మించాలని నిర్ణయించిన సర్కారు ఇటీవల రూ.25 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలుచోట్ల ప్రహరీల నిర్మాణం ప్రారంభించగా ఆయా చోట్ల సీసీ కెమెరాలు బిగిస్తున్న ఆఫీసర్లు, కాపలాగా సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తున్నారు.
కబ్జాదారులపై కేసులు.. భూములు వెనక్కి
అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది.
ఆయా ప్రాంతాల్లో వీటికి వేల ఎకరాల భూములు కేటాయించింది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 500 ఎకరాల దాకా భూములిచ్చింది. ఆయా కాలనీల్లోని ఖాళీ జాగాల పరిరక్షణను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాదారులు ప్రభుత్వంపైనే కోర్టుకెక్కడంతో పలు భూములు వివాదాస్పదంగా తయారయ్యాయి. పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హౌసింగ్ బోర్డు భూములపై దృష్టిసారించింది.
చట్టవిరుద్ధంగా భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెడ్తామని హెచ్చరించిన హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఓవైపు కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తూనే మరోవైపు గతంలోని వివిధ ప్రైవేటు సంస్థలకు అప్పగించినా వినియోగించని భూములను నిబంధనల ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు.
జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు
మొదటి దశలో హౌసింగ్ బోర్డు, దిల్ పరిధిలోని ఖాళీగా ఉన్న స్థలాల గుర్తింపు కోసం జీపీఎస్ సర్వే నిర్వహించిన ప్రభుత్వం హౌసింగ్‌బోర్డుకు సంబంధించి 703 ఎకరాల మేర జియో ట్యాగ్ చేసింది. ఇందులో ఇప్పటివరకు 410 ఎకరాల భూముల చుట్టూ రూ.10కోట్లతో కాంపౌండ్ వాల్స్ నిర్మాణం ప్రారంభించగా, చాలా వరకు పూర్తయ్యాయి. దిల్‌కు సంబంధించిన 943.52 ఎకరాల భూములను జియోట్యాగ్చేసిన ప్రభుత్వం రూ.10 కోట్ల అంచనాతో కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తోంది. జూన్ నెలాఖరులోగా ఇవి పూర్తి కానున్నాయని హౌసింగ్ బోర్డు అధికారులు చెప్తున్నారు.
ఆయా చోట్ల ఖాళీ జాగాల పరిరక్షణకు సీసీ కెమెరాలతో పాటు, సెక్యూరిటీ గార్డులనూ నియమించేందుకు సర్కారు సిద్ధమైంది. రానున్న కాలంలో సీసీ టీవీలను కూడా శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే దిశగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటివరకు 28,499 మీటర్ల ప్రహరి నిర్మాణ దశలో ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
లీజుకు ఇచ్చిన భూములు స్వాధీనం
గతంలో జాయింట్ వెంచర్ కింద వివిధ సంస్థలకు కేటాయించిన భూములను ఆయా సంస్థలు నిబంధనల మేరకు వినియోగించని కారణంగా హౌసింగ్ బోర్డు వెనక్కి తీసుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు 20 జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ లను చేపట్టింది. ఇందులో 14 ప్రాజెక్ట్ లు పూర్తికాగా మిగిలిన ప్రాజెక్ట్ లు కోర్టు కేసుల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం హౌసింగ్భూముల పరిరక్షణతోపాటు కోర్టు కేసుల్లో ఉన్న వాటిపై బలమైన వాదనలు వినిపించేలా సీనియర్ అడ్వకేట్లను నియమించింది.
దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే 18 ఎకరాల భూములను రెండు సంస్థల నుంచి ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి 10.41 ఎకరాల స్థలాన్ని, మధుకాన్ ప్రాజెక్ట్ నుంచి 7.32 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. యూనివర్సల్ డెవలపర్స్ కంపెనీకి ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని సస్పెండ్ చేసింది.