- ఒకప్పుడు క్యాన్సర్ కారకంగా పిలవబడిన హన్ రివర్
- నేడు సియోల్ అభివృద్ధికి చిరునామాగా మారిన వైనం
- విజయవంతంగా మంత్రుల బృందం సియోల్ టూర్
సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఎకానమీని 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సౌత్ కొరియాలోని సియోల్ సిటీని నమూనాగా పెట్టుకున్నది. ఇక్కడున్న హన్ రివర్ ఫ్రంట్ ను నాలుగు రోజుల పాటు స్టడీ చేసిన రాష్ట్ర మంత్రుల బృందం గురువారం హైదరాబాద్ బయలుదేరింది. సియోల్‌లో ఉన్న హన్ రివర్ మ్యూజియం పరిశీలిస్తే గతంలో ఈ నది మన మూసీ ని తలపించేలా ఉండేదని అర్థమవుతుంది.
పూర్తిగా కలుషితమై క్యాన్సర్ కారకంగా పిలిచే హన్ నదిని పూడ్చేసి ఫ్లైఓవర్ కట్టారు. అయితే సియోల్ డెవలప్ మెంట్ కోసం ఆ ఫ్లైఓవర్ కూల్చేశారు. హన్నదిని డెవలప్‌చేసి సియోల్ మురుగు నీటిని శుద్ధి చేసి అందులో పారిస్తున్నారు. హన్ నది వెంట కొన్ని కిలో మీటర్ల మేర భారీ పార్కులు, తేలియాడే రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటివి డెవలప్ చేస్తున్నారు.
మంత్రుల బృందం తన పర్యటనలో సియెల్లోని స్పోర్ట్స్, స్కిల్ యూనివర్శిటీలను కూడా సందర్శించింది. నాలుగైదు రోజుల్లో ఈ బృందం సీఎం రేవంత్‌రెడ్డి తమ స్టడీ రిపోర్టును అందజేయనుంది. ఈ బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , మేయర్ విజయ లక్ష్మి ఇతర అధికారులు ఉన్నారు.
మురుగు శుద్ధికి ఎంబీఆర్ టెక్నాలజీ
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా మంత్రుల బృందం సౌత్ కొరియాలోని ఇంచియాన్ సిటీలో మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని గురువారం సందర్శిం చింది. అక్కడి అధికారి కిం యాంగ్ సూ పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా మురుగు శుద్ధిలో వాడే అత్యాధునిక టెక్నాలజీ గురించి వివరించారు. సియోల్ సిటీలో మురుగును హన్ నదిలోకి వదిలే వారిమని.. 1976 నుంచి మురుగు శుద్ధి చేయడం మొదలు పెట్టామన్నారు. అత్యాధునిక ఎంబీఆర్ టెక్నాలజీ వాడి వీలైనంత ఎక్కువ శుద్ధి చేసిన మంచి నీటిని పొందవచ్చని, ఆ నీటిని ప్రజా అవసరాల కోసం, ల్యాండ్ స్కేపింగ్‌కు వాడుతామని చెప్పారు.