
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. దేశంలో యువత ఎక్కువగా డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, దీనికి సామాజిక పరిస్థితులు కూడా కారణమని అభిప్రాయపడ్డారు.
శనివారం హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో డైరెక్టర్ ఆఫ్ జువైనల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ కార్యాలయంలో జువైనల్ డీ అడిక్షన్ సెంటర్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో డ్రగ్ కల్చర్ వేగంగా విస్తరిస్తుందని, తద్వారా అనారోగ్య సమస్యలతో పాటు నేరాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ లక్ష్యానికి అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు కృషి చేస్తున్నామని వివరించారు. ఇందుకు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా ‘మిషన్ పరివర్తన’ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రిహాబిలిటేషన్ సెంటర్లు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డ్రగ్స్ నియంత్రణకు పాటు పడుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో అబ్జర్వేషన్ హోమ్‌లో పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వమే డీఅడిక్షన్ సెంటర్ నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సెంటర్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డ్రగ్స్ బారిన పడిన పిల్లలకు కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్‌తో పాటు పలు రకాల సేవలు ఇక్కడ అందిస్తామని వెల్లడించారు.
త్వరలోనే ఈ డీ-అడిక్షన్ సెంటర్లను అన్ని అబ్జర్వేషన్ హోమ్‌లలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్, డైరెక్టర్ శైలజతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.