ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​.. గ్రేటర్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం

ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​.. గ్రేటర్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం

ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​

గ్రేటర్​ హైదరాబాద్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం..

వీరివే సుమారు 3 లక్షల అప్లికేషన్లు

మార్కెట్​ విలువను బట్టి ఒక్కొక్కరిపై రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు చార్జీలు

డిసెంబర్​ 1 తర్వాత అప్లికేషన్ల పరిశీలన వేగవంతం

రెండు నెలల్లో చార్జీలు మొత్తం వసూలు చేయాలని ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల పరిశీలన, చార్జీల వసూలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వచ్చే వారం నుంచి ఈ ప్రాసెస్​ను ​ స్పీడప్​ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అప్లికేషన్లలో ఎక్కువగా జీహెచ్​ఎంసీ పరిధిలోనివే ఉన్నాయి. మార్కెట్​ విలువను బట్టి సగటున ఒక్కో దరఖాస్తుదారుడు రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమైన ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అనధికార లే ఔట్లలో ఉన్న ఖాళీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​ కోసం  అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లలో కలిపి  మొత్తం 25,59,562 అప్లికేషన్లు  వచ్చాయి. ఎల్ఆర్​ఎస్​ దరఖాస్తు గడువు ముగిసి నెల రోజులు కావస్తున్నా.. గ్రౌండ్​ లెవల్​లో ప్లాట్ల పరిశీలన ఇంకా స్టార్ట్​ కాలేదు. జనవరి 31లోగా ఎల్ఆర్​ఎస్​ ప్రాసెస్​ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.

అప్లికేషన్ల గడువు ముగిసిన వెంటనే వాటిని పరిశీలించి చార్జీలు వసూలు చేయాలని భావించింది. అయితే.. దుబ్బాక ఉప ఎన్నిక, ఆ వెంటనే గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికలు రావడంతో అప్లికేషన్ల పరిశీలన, చార్జీల వసూలును వాయిదా వేసినట్లు తెలిసింది. డిసెంబర్​ 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియనుండటంతో ఆ తర్వాత నుంచి అప్లికేషన్ల పరిశీలనను వేగవంతం చేయాలని, వచ్చే రెండు నెలల్లో చార్జీల వసూలును పూర్తి చేయాలని సర్కార్  భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అప్లికేషన్ల స్క్రుట్నీ, ప్లాట్లు, లే ఔట్ల పరిశీలనకు ఇతర శాఖలకు చెందిన ఆఫీసర్లను వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా ప్లాట్ల రెగ్యులరైజేషన్​ చేయాలని, ఎల్ఆర్​ఎస్​ లేని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్​ వస్తుండటం, కోర్టుల్లో కేసులు నడుస్తుండటంతో  ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఏరియాను బట్టి క్లస్టర్లుగా విభజన

ఎల్​ఆర్​ఎస్​ చార్జీలు వసూలులో భాగంగా మున్సిపల్ శాఖ ఆఫీసర్లు  అప్లికేషన్లను ఏరియాల వారీగా క్లస్టర్లుగా విభజించారు. టౌన్​ ప్లానింగ్​, రెవెన్యూ, ఇరిగేషన్​ శాఖల ఆఫీసర్లతో కూడిన టీమ్​లను క్లస్టర్​ కొకటి నియమించి గ్రౌండ్​ లెవల్​లో ఓపెన్​ ప్లాట్లు, లే ఔట్లను తనిఖీ చేయనున్నట్లు తెలిసింది. తనిఖీ అనంతరం.. చెల్లించాల్సిన ఫీజు ఎంత అనే వివరాలను రిజిష్టర్డ్​ మొబైల్ నంబర్లకు ఎస్సెమ్మెస్ ద్వారా లేదా మెయిల్​ ద్వారా ఆఫీసర్లు పంపనున్నారు.

గ్రేటర్​ వాసులపై రూ. 2 వేల కోట్లకుపైగా భారం

రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు నాటికి ఎల్​ఆర్​ఎస్​ కోసం జీహెచ్​ఎంసీ పరిధి నుంచే 1,06,891 అప్లికేషన్లు వచ్చాయి. ఇవీగాక చాలా మంది జీహెచ్​ఎంసీ వాసులకు గ్రేటర్​ చుట్టుపక్కల  బండ్లగూడ, బడంగ్ పేట, పీర్జాదిగూడ, జవహర్​ నగర్, నిజాంపేట తదితర కార్పొరేషన్లతోపాటు ఇతర మున్సిపాలిటీల పరిధిలోనూ పాట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో స్థిరపడినప్పటికీ ఇన్వెస్ట్​మెంట్ పర్పస్​లో బయటి ప్రాంతాల్లోని నాన్ లే ఔట్​ వెంచర్లలో చాలా మంది ప్లాట్లు కొన్నారు.  గ్రేటర్​ వాసులకు చెందిన ఇలాంటి ప్లాట్లు మరో 2 లక్షల వరకు ఉంటాయని అప్లికేషన్​లో పేర్కొన్న అడ్రస్​ల ఆధారంగా ఆఫీసర్లు గుర్తించినట్లు తెలిసింది. ఒక్కో దరఖాస్తుదారుడు అక్కడి మార్కెట్ విలువను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గ్రేటర్​ హైదరాబాద్​ వాసులకు చెందిన మూడు లక్షల దరఖాస్తుదారులపై దాదాపు  రూ. 2 వేల కోట్లకుపైగా భారం పడే అవకాశం కనిపిస్తోంది.

మూల్యం చెల్లించక తప్పదు
పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా రాష్ట్ర సర్కారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తీసుకొస్తుందనే ప్రచారం కూడా ఉంది. కరోనా కష్ట కాలంలో ప్రజలు పైసలు ఎట్ల కడతరు. ఒక్క హైదరాబాద్‌లోనే ఎల్ఆర్ఎస్‌కు అప్లయ్ చేసినోళ్లు​ లక్షల్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ కుటుంబాల ఆగ్రహానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు.
– నారగోని ప్రవీణ్ కుమార్, కన్వీనర్, తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్

For More News..

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌.. అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి హత్య?

కొవిషీల్డ్‌‌ సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌పై డీసీజీఐ దర్యాప్తు