వ్యాక్సిన్ ఫ్రీనా? సబ్సిడీనా? ఆలోచనలో సర్కార్!

వ్యాక్సిన్ ఫ్రీనా? సబ్సిడీనా? ఆలోచనలో సర్కార్!
  • వ్యాక్సిన్​ పంపిణీపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు
  • 18 ఏండ్లు నిండినోళ్లకు మే 1 నుంచి కరోనా టీకాలు
  • 70 శాతం మంది సర్కారు దవాఖాన్లలో వ్యాక్సిన్​ వేయించుకుంటారని అంచనా
  • వ్యాక్సినేషన్​కు 1,120 కోట్లు ఖర్చు అవ్వొచ్చు
  • 30 శాతం మంది ప్రైవేట్​కు వెళ్లే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వాలా? సబ్సిడీపై ఇవ్వాలా? అనే దానిపై సర్కారు ఆలోచిస్తోంది.మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వాళ్లందరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని కేంద్రం  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో  రాష్ట్రంలో ఎన్ని డోసుల వ్యాక్సిన్ అవసరం? ఏ మేరకు ఖర్చవుతుంది? అన్న దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తే 70 శాతం మంది గవర్నమెంట్ దవాఖాన్లలో టీకా వేసుకోవచ్చని..    ఇందుకు రూ.1,120 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక మిగతా 30 శాతం మంది ప్రైవేట్‌‌లో వ్యాక్సిన్ వేసుకునే చాన్స్ ఉందని భావిస్తోంది. వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందని, కొంత సబ్సిడీతో  ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ ఎలాంటి ఫీజు లేకుండా, అందరికీ ఫ్రీగా అందిస్తేనే ప్రభుత్వానికి రాజకీయంగా మైలేజ్ వస్తుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సోకడంతో ఫామ్​హౌస్​లో ఉన్న సీఎం కేసీఆర్ కోలుకున్న తర్వాతే వ్యాక్సినేషన్ పై తుది నిర్ణయం తీసుకుంటారని ఓ ఐఏఎస్ అధికారి తెలిపారు. 

ఆరు కోట్ల డోసులు అవసరం
రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన వారు మూడు కోట్ల మంది వరకు ఉంటారని, వీళ్లకు రెండుసార్లకు ఆరు కోట్ల డోసులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. టీకా కంపెనీలు ఒకే వ్యాక్సిన్ కు రెండు రకాల ధరలను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ పీఎం మోడీకి త్వరలో సీఎం కేసీఆర్ లేఖ రాసే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. కేంద్రానికి విక్రయించే ధరలకే రాష్ట్రాలకు కూడా  వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరనున్నారు. 
 

ఇతర రాష్ట్రాల్లో అమలుపై ఆరా
చత్తీస్​గఢ్​, యూపీ, ఎంపీ, అస్సాం ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో 18 ఏండ్లు నిండినోళ్లకు ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలుపై దృష్టి సారించాయి. దీంతో ఆ ప్రభుత్వాలు ఏ విధంగా వ్యాక్సినేషన్ ను ఉచితంగా ఇస్తున్నాయి?  కేంద్రం నుంచి ఏమైనా ఆర్థిక సాయం అడిగాయా? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

తెల్లరేషన్ కార్డుదారులకే ఫ్రీనా?
ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వకుండా కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా సర్కారు ఆలోచన చేస్తోంది. ఒకవేళ తెల్లరేషన్ కార్టులు ఉన్నవారికే టీకా ఉచితంగా ఇస్తే జనాభాలో 60 శాతం మంది  లబ్ధి పొందుతారని అంటున్నారు. కొందరు అర్హులైన పేదలకు తెల్ల  రేషన్ కార్డులు జారీ చేయలేదు. అలాంటి వారికోసం ఎమ్మోర్వో ఆఫీసు నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే ఉచితంగా వ్యాక్సిన్ వేసే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.