- లో లెవల్ కెనాల్‌కు అడ్డుగా ఉన్న 400 మీటర్ల బండరాయి తొలగింపునకు చర్యలు
- నేడు రిజర్వాయర్‌ను విజిట్ చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహబూబ్‌నగర్/మక్తల్, వెలుగు: 18 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాజీవ్ భీమా స్కీంలోని సంగంబండ రిజర్వాయర్ పరిధిలో లెఫ్ట్ లో లెవల్ కెనాల్‌కు అడ్డుగా ఉన్న 400 మీటర్ల బండరాయిని తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎమ్మెల్యే వాటికి శ్రీహరి ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి, మినిస్టర్ ఉత్తం కుమార్ రెడ్డికి వివరించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మినిస్టర్ ఉత్తకుమార్ రెడ్డి వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదీ జరిగింది..
సంగంబండ రిజర్వాయర్‌కు 1995లో శంకుస్థాపన చేశారు. దీని కింద 68 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం 290 మంది రైతుల నుంచి 800 ఎకరాల భూమిని సేకరించారు. వీరికి అప్పట్లోనే పరిహారం క్లియర్ చేశారు. అలాగే రిజర్వాయర్ కింద సంగంబండ గ్రామం ముంపునకు గురైంది. 776 కుటుంబాలను ముంపు బాధితులుగా ఆఫీసర్లు గుర్తించారు. వీరికి నవంబరు 21, 2003లో గ్రామ సమీపంలోని 68 ఎకరాలను పునరావాస కేంద్రం కోసం కేటాయించారు.
అయితే ఈ 68 ఎకరాల్లో పది ఎకరాలను రిజర్వాయర్‌లోని లో లెవల్ కెనాల్ నిర్మాణం కోసం వినియోగించారు. మిగిలిన 58 ఎకరాల్లోనే ప్లాట్లు చేశారు. అయితే ప్లాట్లు బాధితులందరికీ సరిపోలేదు. 776 కుటుంబాలకు గాను 546 కుటుంబాలకే ప్లాట్లు కేటాయించారు. మరో 80 కుటంబాలకు రూ.78 వేల చొప్పున పరిహారం చెల్లించారు. మిగిలిన 150 కుటుంబాలకు కూలీ పనుల కింద ఏడాది కాలానికి రూ.12 కోట్లు చెల్లిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ, ఇచ్చిన హామీ ప్రకారం వీరికి రూ.12 కోట్లు చెల్లించలేదు. దీంతో వీరు అప్పటి నుంచి పనులను అడ్డుకుంటున్నారు. ఈ కాలువ మధ్యలో 400 మీటర్ల బండరాయి అడ్డుగా ఉండగా, దీన్ని తొలగిస్తే కాలువ పూర్తవుతుంది. కానీ, రూ.12 కోట్ల డబ్బులు చెల్లించలేదని బాధితులు పనులను అడ్డుకోవడంతో 18 ఏండ్లుగా బండరాయి తొలగింపు పనులు ఆగిపోయాయి. పలుమార్లు కాంట్రాక్టర్లు బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వారు డబ్బులు చెల్లిస్తేనే పనులు చేసేందుకు అంగీకరిస్తామని చెప్పడంతో ఊరుకున్నారు.
పదేండ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉన్నా ఈ సమస్య గురించి పట్టించుకోలేదు. 2014 నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు.. ప్రతి ఎన్నికల్లో ఈ సమస్యను పరష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల నినాదంగా తెరమీదకు తీసుకొచ్చింది. కానీ, సమస్య పరిష్కరించలేదు. అయితే, మక్తల్ ఎమ్మెల్యే వాటికి శ్రీహరి ఎన్నికల ప్రచారంలోనే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యకు పరష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యను మొదట సీఎం వద్ద డిస్కస్ చేశారు. నెలన్నర కింద ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమస్య వివరించి, వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఇరిగేషన్ మినిస్టర్ ఇటీవల పెండింగ్‌లో ఉన్న రూ.12 కోట్లల్లో రూ.10.07 కోట్లను ముంపు బాధితుల అకౌంట్లలో జమ చేయించారు. దీంతో 18 ఏండ్లుగా లో లెవల్ కెనాల్ పనులకు అడ్డుగా ఉన్న బండరాయి తొలగింపునకు మార్గం సుగమమైంది. ఈ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు బుధవారం డిప్యూటీ సీఎంతో పాటు ఇరిగేషన్ మినిస్టర్ వస్తున్నారు. అనంతరం జరిగే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొంటారు.
18 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు..
సంగంబండ రిజర్వాయర్ నుంచి లెఫ్ట్ లో లెవల్ కెనాల్ దాదాపు 18 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ కెనాల్ నిర్మాణం పూర్తయితే మాగనూరు, వడ్వాట్, దాసర్‌దొడ్డి, పర్మాన్ దొడ్డి, సత్యావార్, గుర్లపల్లి, తిర్మలాపూర్, వనాయిఉంట, అమ్మపల్లి గ్రామాల పరిధిలోని ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే ఈ గ్రామాల్లోని చెరువులను నింపనుండడంతో మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలున్నాయి.
సీఎంతో మాట్లాడినం..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకముందే ముంపు బాధితులకు పరిహారం మంజూరు చేయించా. పెండింగ్‌లో ఉన్న లో లెవల్ కెనాల్ పనులు కూడా త్వరలో పూర్తి చేయిస్తా. సంగంబండ రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సీఎంతో మాట్లాడా. రిజర్వాయర్ వద్ద ఆహ్లాదకర వాతావరణం, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలు ఆకట్టుకుంటాయి. అందుకే ఇక్కడ హరిత హోటల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాం.
– వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్