- అధికారుల కసరత్తు.. త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములో అడుగు ముందుకు పడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 7 మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు భూసేకరణ చేసేందుకు ఇరిగేషన్ శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. 1,550 ఎకరాల భూమిని సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలోనే ఈ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. రూ.1350 కోట్లతో ఇప్పటికే ప్రభుత్వం పరిపాలన అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే.
మొదటిదశలో భాగంగా రెండు ప్యాకేజీల టెండర్లను మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఇరిగేషన్ శాఖ ఒప్పందం చేసుకున్నది. ఒకటో ప్యాకేజీలో పంప్‌హౌస్, ప్రెజర్ మెయిన్, మూడు చెరువుల విస్తరణ పనులుండగా.. రెండో ప్యాకేజీలో రెండు పంప్‌హౌస్‌లు, ప్రెషర్మెయిన్ల పనులను చేపట్టాల్సి ఉంది. మొదటి దశ పనుల్లోనే మూడు చెరువులను నింపేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. ఊట్కూరు చెరువు కింద 16,193 ఎకరాల ఆయకట్టు ఉండగా.. జయమ్మ చెరువు కింద 4,236 ఎకరాలు, కానుకుర్తి చెరువు కింద 29,151 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఆయా చెరువులను విస్తరించేందుకు వెయ్యి ఎకరాల భూసేకరణ అవసరమని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే ఆయా పనులకు సంబంధించిన హైడ్రాలిక్ వివరాలకు సీఈ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన పనులకు తొలుత 530 ఎకరాలు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. భీమా ఎత్తిపోతల్లోని భూత్పూర్ జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసే పంప్‌హౌస్, 16.9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, ఊట్కూరులో నిర్మించే రెండో పంప్‌హౌస్, 11.73 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, నారాయణపేట మండలంలోని జయమ్మ చెరువు నుంచి నీటిని ఎత్తిపోసే పంప్‌హౌస్, 8.98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ల నిర్మాణం కోసం 550 ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.