- కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్న సర్కార్
- ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో మార్పులు చేసేందుకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: భూసేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం రైతుల దగ్గరి నుంచి తీసుకునే భూముల విషయంలో కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నది. భూసేకరణకు సంబంధించి బహిరంగ మార్కెట్ రేటుకు అనుగుణంగా రైతులకు పరిహారం ఇవ్వాలని.. ఇందుకోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నది.
రైతులు నష్టపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని యోచన
ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. బహిరంగ మార్కెట్ విలువకు దగ్గరగా పరిహారం ఉండేలా భూసేకరణ విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ విషయంలో ఇదే పద్ధతి అమలు చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ విషయంలో రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీంతో భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
Also Read:-హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గణేశ్ఉత్సవాలు
అందుకు అనుగుణంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా పెంచాలని భావిస్తున్నది. భూసేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్ల చేతిలో ఉండడంతో... ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇస్తే భూసేకరణకు ఇబ్బంది ఉండదని సర్కార్ యోచిస్తున్నది.
రైతులు ఇబ్బందులు పడొద్దని..
ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ తో పాటు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ చేయాల్సి ఉన్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీకి భూసమీకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతుల నుంచి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేల ఎకరాల భూములు రైతుల నుంచి తీసుకునే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లు, మల్లన్న సాగర్, వరంగల్ సిటీ ఔటర్‌రింగ్‌రోడ్డు, ట్రిపుల్ ఆర్ కు సంబంధించిన భూసేకరణ విషయంలో పరిహారం తక్కువగా నిర్ణయించడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
చివరకు కొన్ని ప్రాజెక్టులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల కోసం తీసుకువస్తున్న ప్రజా ప్రయోజన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండొద్దని, అదే సమయంలో రైతులకూ ఇబ్బంది కలగొద్దని పరిహారం పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్టు సెక్రటేరియెట్‌లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘‘వారసత్వంగా ఏండ్ల తరబడి వస్తున్న వ్యవసాయ భూములు తీసుకుంటున్నప్పడు రైతులు బాధలో ఉంటారు.
ఆ సమయంలో ఇచ్చే పరిహారం కూడా తగ్గితే అది ప్రభుత్వంపై ఆగ్రహాన్ని పెంచుతుంది. గత పదేండ్లలో ఇలాంటి సంఘటనలు కొకొల్లలుగా జరిగాయి” అని సీఎం ఇటీవల అధికారులతో అన్నట్టు ఆయన వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితి రావొద్దని, మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారని పేర్కొన్నారు.