7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు: ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే

  • నాలుగేండ్లలో లక్ష్యం చేరుకునేలా ప్రభుత్వ ప్రణాళికలు
  • ఆరు జిల్లాల్లో సాగుకు నిర్ణయం
  • 75 వేల మంది రైతులకు ఉపాధి
  • పైలట్ ప్రాజెక్ట్​గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపిక
  • మార్చి నుంచి నర్సరీల్లోవెదురు ప్లాంటేషన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే నాలుగేండ్లలో 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసి.. 75వేల మంది రైతులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నది. ఇప్పటికే వెదురు ఉత్పత్తులు.. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. సూపర్ థర్మల్ ప్రాజెక్టుల్లోనూ బొగ్గు వాడకాన్ని తగ్గించేందుకు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు వెదురు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

మన రాష్ట్రంలోనూ వెదురును వాడుకునేలా థర్మల్ ప్లాంట్లు సిద్ధమవుతున్నాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో వెదురుకు చాలా డిమాండ్ ఉండబోతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హార్టికల్చర్, ఫారెస్ట్, సెర్ప్​తో కలిసి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది.

కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో వెదురు సాగు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి జిల్లాను ఎంపిక చేసింది. ముందుగా అక్కడి భూమి వెదురు సాగుకు అనుకూలంగా ఉందా.. లేదా అనేదానిపై ప్రభుత్వమే టెస్టులు చేయనున్నది. రైతులకు పైసా ఖర్చు లేకుండా మొత్తం సాగు బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోనున్నది. మొక్కలు అందించడం నుంచి అవి పెరిగి చేతికొచ్చి మార్కెట్​కు తరలించేదాకా మొత్తం సర్కారే చూసుకోనున్నది.

రైతుకు ఉన్న భూమిలో పావు భాగంలో వెదురు సాగు చేయనున్నది. వచ్చే నెల నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో హార్టికల్చర్, ఫారెస్ట్, సెర్ప్ అధికారులు రైతులతో సమావేశమై వెదురు సాగుపై అవగాహన కల్పించనున్నారు. విత్తనాలు, వర్మీకంపోస్టు ఎరువుల తయారీ, మార్కెటింగ్ వంటి అంశాల గురించి వివరించనున్నారు. ఐకేపీ, గ్రామ సమాఖ్య సంఘాలు సమావేశాలు నిర్వహించి రైతులను ఎంపిక చేస్తాయి. 

తొలుత 5వేల మంది రైతుల ఎంపిక

తొలుత 5వేల మంది రైతులను ఎంపిక చేస్తారు. 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో వెదురు సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ భూసార పరీక్షలు చేస్తది. ముందుగా ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి వెదురు మొక్కల పెంపకం చేపడ్తారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలు ఏర్పాటు చేయనున్నారు.

సీడ్స్ వేసిన 15 రోజుల తర్వాత మొలకలు వస్తాయి. అవి ఏపుగా పెరిగేందుకు సేంద్రియ ఎరువులు వాడుతారు. ఈ పనులన్నీ ఉపాధిహామీ కూలీల ద్వారా చేపడ్తారు. నర్సరీల్లో మొక్కలు 3 నెలలు పెరిగాక.. వాటిని రైతులకు అందిస్తారు. వెదురు సాగు చేసే ఆరు జిల్లాల్లో మార్చిలో నర్సరీలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎకరంలో 60 వెదురు మొక్కలు

గ్రీన్ గోల్డ్ గా పిలిచే వెదురు రకాన్ని సాగు చేయనున్నారు. ఎకరంలో 60 వెదురు మొక్కలు నాటనున్నారు. ఇందులో 20 శాతం మొక్కలు చనిపోయే చాన్స్ ఉంటది. వీటి స్థానంలో రీ ప్లాంటేషన్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటున్నది. మొక్క మొక్కకు మధ్య గ్యాప్ 15X15 అడుగుల దూరం ఉండేలా నాటుతారు. సాగుకు ముందు భూమిలో కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. 20 సెంటీ మీటర్ల లోతు తవ్వి మొక్కలు నాటుతారు. మూడేండ్లకు వెదురు చేతికి వస్తుంది.

ఆ తర్వాత నుంచి ఏడాదిలోనే వెదురు ఏపుగా పెరుగుతుంది. 30 ఏండ్ల వరకు సాగు చేసుకోవచ్చు. డిసీజ్ వస్తే తప్ప సాగుకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఒక బొంగు 30 నుంచి 60 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడిపెడితే.. ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తుంది. ఒక్కో బొంగు రూ.130 నుంచి రూ.170 వరకు పలుకుతుంది.

4 కేజీల వెదురు నుంచి 1.2 లీటర్ల ఇథనాల్

తమిళనాడు, కర్నాటక, చత్తీస్​గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలో వెదురు సాగుకు సంబంధించి టెక్నికల్ సపోర్ట్ కోసం ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ డీల్ కుదుర్చుకున్నది. తెలంగాణలో సెర్ప్​తో కలిసి పని చేయనున్నది. 4 కేజీల వెదురు నుంచి 1.2 లీటర్ల ఇథనాల్ తీయొచ్చు. ఎకరాకు 10 వేల లీటర్ల ఇథనాల్ తీయొచ్చు.

వెదురులో 10 రకాలుంటే.. తెలంగాణ వాతావరణంలో బ్యాంబుసా, బాల్క్​కోవ బ్యాంబు, బ్యాంబుసా ట్యూల్డా, డెంట్రో కాలమ్, న్యూటన్ బ్యాంబు సాగు చేయొచ్చు. రోజుకు 3 ఫీట్లు పెరుగుతాయి. వెదురుతో తయారు చేసిన బ్రష్​లు, దువ్వెనలు, రేజర్లు, ఫర్నీచర్, అలంకరణ వస్తువులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నది.