- కులగణన, బీసీ కమిషన్ రిపోర్టులపై రెండింటిలో చర్చ
- బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
- పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు
- ఎలక్షన్ కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే చాన్స్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని తుది దశకు తెచ్చింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 5న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. ఈలోగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా అందుతుందని, దానిపైనా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. కులగణన సర్వే ముసాయిదా నివేదిక శుక్రవారం కేబినెట్ సబ్‌కమిటీ ముందుకు రానుంది. ఫిబ్రవరి 2న పూర్తి నివేదికను ప్లానింగ్‌శాఖ అందించనుంది. కేబినెట్భేటీ తర్వాత ఫిబ్రవరి 7న ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి.. కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టులను సభలో పెట్టి చర్చించనున్నట్టు తెలుస్తున్నది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని యోచిస్తున్నది.
ఫిబ్రవరి రెండో వారంలో..
మార్చి 5 నుంచి ఇంటర్, మార్చి 17 నుంచి టెన్త్‌పరీక్షలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తే పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అనే కోణంలో సర్కార్ ఆలోచిస్తున్నది. అయితే స్థానిక ఎన్నికలతో ఇంటర్‌పరీక్షలకు పెద్దగా ఇబ్బంది ఉండదని, పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి జరగనున్నందున ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెడితే సమస్య లేదని అధికారులు అన్నట్టు తెలిసింది. దీంతో ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి, మార్చి రెండో వారం కల్లా ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా, ఫిబ్రవరిలోనే బడ్జెట్‌సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉన్నందున, వీటిన్నింటినీ సమన్వయం చేసుకోవడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తప్పనిసరి!
రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యుల్విడుదలైంది. ఎన్నికలు జరగనున్న ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎలక్షన్కోడ్అమల్లోకి వచ్చింది. దీంతో కేబినెట్సమావేశానికి ఈసీ అనుమతి తప్పనిసరి అని తెలుస్తున్నది. ఒకవేళ కేబినెట్భేటీకి ఈసీ అనుమతి ఇచ్చినా, ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపని నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేబినెట్మీటింగ్ లో తీసుకునే నిర్ణయాలు బయటకు చెప్పే అవకాశం ఈసీ ఇస్తుందా? లేదా? అన్నది అసక్తికరంగా మారింది. ఒకవేళ నిర్ణయాలు బయటకు చెప్పొద్దని ఈసీ ఆదేశిస్తే.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మరోవైపు ఇటీవల 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి ఎలక్షన్ షెడ్యూల్‌కంటే ముందు నుంచే కొనసాగుతున్న స్కీమ్స్ కావడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఈసీ నుంచి ప్రత్యేకంగా ఏమైనా ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.