- ఆర్&బీ లో 12 వేల కిలో మీటర్లు.. పీఆర్ లో 17 వేల కిలో మీటర్లు..
- జిల్లాల నుంచి వివరాలు తీసుకున్న రోడ్లు, భవనాల శాఖ
- త్వరలో తొలి దశ రోడ్లను ఎంపిక చేయనున్న మంత్రులు.. ఏప్రిల్‌లో టెండర్లు పిలవనున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాబోయే మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 12 వేల కిలో మీటర్ల ఆర్ అండ్ బీ , 17 వేల కిలో మీటర్ల పంచాయతీ రాజ్ (పీఆర్) రోడ్లను పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నది. మొదటి రెండేండ్లలో ప్రతి ఏటా 4,500 కిలో మీటర్ల చొప్పున, చివరి ఏడాది 3 వేల కిలో మీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లకు మరమ్మతు చేయనున్నది. ఇందులో గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ వరకు డెవలప్ చేసే రోడ్లు ఉన్నాయి.
వచ్చే ఏడాది అభివృద్ధి చేయాల్సిన రోడ్లపై జిల్లా అధికారుల నుంచి ఆర్అండ్ బీ శాఖ వివరాలు తీసుకోనున్నది. ఈ ప్రతిపాదనలను త్వరలో అర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెక్రటరీ హరిచందనతోపాటు ఈఎన్సీ, సీఈలతో సమావేశం నిర్వహించి, ఫైనల్ చేయనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి కూడా జిల్లాల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా.. త్వరలో పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు ఆ శాఖ మంత్రి సీతక్కతో సమావేశం అయి.. తొలి దశలో మరమ్మతులు చేసే రోడ్లను ఫైనల్ చేసి.. 2 శాఖలు ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఇవ్వనున్నట్టు సమాచారం.
ప్రైవేట్ కన్సల్టెంట్ కు డీపీఆర్ బాధ్యతలు
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని పబ్లిక్–ప్రైవేట్–పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసే అంశంపై అధ్యయనం చేసేందుకు ఆర్ వీ అసోసియేట్, లీ అసోసియేట్ కంపెనీలు జాయింట్ వెంచర్ గా టెండర్ దక్కించుకున్నాయి. ఈ టెండర్ పై ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే 9 నెలల్లో రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి, రిపేర్లపై 3 దశల్లో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని, తొలి దశ రిపోర్ట్‌ను మార్చి చివరి నాటికి అందించాలని ప్రభుత్వం టెండర్ లో స్పష్టం చేసింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ రోడ్ల కు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు టెండర్లు పిలవనున్నట్టు తెలుస్తున్నది.