మార్చి 1న లక్ష రేషన్ కార్డులు.. ఒక్క రోజే భారీ మొత్తంలో పంపిణీకి ఏర్పాట్లు

మార్చి 1న లక్ష  రేషన్ కార్డులు.. ఒక్క రోజే భారీ మొత్తంలో పంపిణీకి ఏర్పాట్లు
  • హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్  జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్
  • మార్చి 8 తర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ! 

హైదరాబాద్: ఒక్క రోజే లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 1వ తేదీన వీటిని పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో వీటిని పంపిణీ చేయడం లేదు.  ఆ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది. ఒకే రోజు లక్ష రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మిగతా జిల్లాల్లో మార్చి 8న అందించేందుకు  ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా  జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 

కొత్తగా రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, వికారాబాద్‌ జిల్లాలో 22 వేలు, నాగర్‌కర్నూల్‌లో 15 వేలు, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13 వేల చొప్పున, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మేడ్చల్‌ మల్కాజిగిరి, వనపర్తి జిల్లాల్లో 6 వేల చొప్పున, హైదరాబాద్‌‌లో 285 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.