
- కార్డులు వచ్చేవరకు మంజూరైనోళ్లకు బియ్యం ఇస్తం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కొత్తవి వచ్చే వరకు కార్డులు మంజూరైనోళ్లకు బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులు అందిస్తామని తెలిపారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటించారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో 84 శాతం మందికి మనిషికి 6 కిలోల చొప్పున ఫ్రీగా సన్నబియ్యం ఇవ్వనున్నాం. ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే విప్లవాత్మక కార్యక్రమం. రాష్ట్రంలో దాదాపు 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవల కొత్త దరఖాస్తులు స్వీకరించాం. కుటుంబ సభ్యులను యాడ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించడం లే దు. రూ.8 వేల కోట్ల బియ్యం పంపిణీ జరిగితే, వాటిని లబ్ధిదారులు ఉపయోగించకపోవడంతో పక్కదారి పట్టాయి. అందుకే పేదలు కడుపునిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం” అని తెలిపారు.
ఒకట్రెండు రోజుల్లో దేవాదుల పంపింగ్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నివేదికలు వచ్చాకే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరగా రిపోర్టు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏను కోరామని చెప్పారు. కాళేశ్వరం పనుల్లో డిజైన్, నిర్మాణం, మెయింటెనెన్స్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కుమ్రంభీమ్, చనాక కొరాటా, జగన్నాథ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామన్నారు.