సన్నబియ్యం వచ్చేస్తున్నాయ్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,050 రేషన్ షాపులు

సన్నబియ్యం వచ్చేస్తున్నాయ్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,050 రేషన్ షాపులు
  • 9,03,709 ఆహార భద్రత కార్డులు 
  • ప్రతి నెలా 15,929 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం 
  •  ఏప్రిల్ ఒకటి నుంచి పంపిణీకి ఏర్పాట్లు 

మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ నిర్ణయం మేరకు రేషన్​షాప్​ల ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంతో పాటు హాస్టల్ స్టూడెంట్స్​కు భోజనం కోసం  సన్న బియ్యాన్ని వినియోగిస్తున్నారు. రేషన్​షాప్​ల ద్వారా ఆహార భద్రత, అన్నపూర్ణ, అంత్యోదయ అన్నయోజన కార్డు దారులకు ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ ఇచ్చిన హామీ మేరకు వచ్చేనెల ఒకటి నుంచి అందరికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. 

ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.  ఏప్రిల్​ ఒకటి నుంచి అన్ని రేషన్​ షాప్​ల్లో సన్నబియ్యం ఇస్తారు. ఈ మేరకు ఎంఎల్​ఎస్​ పాయింట్లకు సన్నబియ్యం చేరుకుంటుండగా అక్కడి నుంచి రేషన్​ షాప్​లకు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,050 రేషన్ షాపులు ఉండగా,  9,03,709 రేషన్​ కార్డులు ఉన్నాయి.  ప్రతి నెలా 15,929 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ 
చేయనున్నారు.   

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో 684 రేషన్ షాపులుండగా మొత్తం 3.10 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 8,95,457 మంది లబ్ధిదారులకు  ఐదువేల టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వచ్చే మూడు నెలల పాటు సన్న బియ్యం సజావుగా సరఫరా చేయడానికి అధికారులు స్టాక్ ను సిద్ధంచేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా 888 కొత్త రేషన్ కార్డులను అధికారులు జారీ చేయగా పెండింగ్ లో ఉన్న దాదాపు  75 వేల పై చిలుకు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. కొత్తగా మంజూరైన కార్డులతో పాటు కొత్తగా నమోదైన వారికి సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.  

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 846 రేషన్ షాపులు ఉండగా, 3.78 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 12.33 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రతి నెలా వారికి 6,622 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి వీరందరికి సన్న బియ్యం పంపిణీ చేయడానికి 7వేల టన్నుల బియ్యం అవసరం. కొత్త రేషన్ కార్డుల కోసం 26 వేల దరఖాస్తులు రాగా వాటి వెరిఫికేషన్ పూర్తయింది. మరో నాలుగు రోజుల్లో సన్న బియ్యం పూర్తిస్థాయిలో గోదాములకు చేరే అవకాశం ఉందని పౌరసరఫరాల సంస్థ మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. బియ్యం చేరగానే వాటిని రేషన్ షాపులకు చేరవేస్తామని చెప్పారు. 

మెదక్ జిల్లాలో..

జిల్లలోని 21 మండలాల పరిధిలో 520 రేషన్​ షాప్​లు ఉన్నాయి. వాటి పరిధిలో 2,14,155 కార్డులు ఉండగా, 6,84,898 మంది సభ్యులు ఉన్నారు. అన్ని రకాల కార్డులకు కలిపి ప్రతి నెలా4,367 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కొత్త రేషన్​ కార్డుల కోసం 1,335 దరఖాస్తులు రాగా, 21,319 మంది కొత్తగా యాడ్​అయ్యారు. వారికి వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 7 ఎంఎల్​ఎస్​ పాయింట్ల ద్వారా రేషన్​ షాప్​లకు సన్నబియ్యం సరఫరా చేయడానికి సివిల్​సప్లై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

బ్లాక్ మార్కెటింగ్ దందాకు చెక్

దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్ దందాకు సన్నబియ్యం పంపిణీ తో చెక్ పడే అవకాశాలున్నాయి. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన దొడ్డు బియ్యంలో దాదాపు నలభై శాతానికి పైగా లబ్ధిదారులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. కిలో 15 రూపాయలకు కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని రీ సైక్లింగ్ తో సన్న బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్​లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొందరు వ్యాపారులు దొడ్డు బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. 

ప్రభుత్వం దొడ్డు బియ్యం దందాను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయిలో ఆపలేకపోయింది. ప్రతి రోజు జిల్లాలో ఎక్కడో ఒక చోట అక్రమ రవాణా చేస్తున్నబియ్యాన్ని పోలీసులు పట్టుకుంటున్న ఉదంతాలు ఇకపై తగ్గే అవకాశం ఉంది. అలాగే  బహిరంగ మార్కెట్​లో బియ్యం ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సన్నబియ్యం క్వింటాలు ఆరు నుంచి పది వేల రూపాయలు పలుకుతోంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీతో పేద, మధ్య తరగతి ప్రజలు మార్కెట్​లో బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి తగ్గడం వల్ల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

సన్న బియ్యం పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో సన్న బియ్యం పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాం. ఉగాది రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించగానే అన్ని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తాం. ఇందుకు సంబంధించి ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నాం. ప్రతి నెలా దాదాపు ఐదు వేల టన్నుల సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తాం. కొత్తగా వచ్చిన75 వేల  రేషన్ కార్డు దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. - తనూజ, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్, సిద్దిపేట