గుడ్ న్యూస్: ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధం

గుడ్ న్యూస్: ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధం
  • ఈ నెల 30న హుజూర్​నగర్​లో ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి సర్కారు సిద్ధమైంది. అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సివిల్​ సప్లయ్స్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ చౌహాన్​ రాష్ట్రంలోని అన్ని రేషన్​ షాపులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్​నగర్ లో సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 84 శాతం నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయబోతున్నారు. ఇన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో ఒక్కింటికీ  రూ.40 ఖర్చుచేసి పేదలకు అందిస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇన్నాళ్లు పంపిణీ చేస్తున్న దొడ్డుబియ్యంను లబ్ధిదారులు తినకుండా అమ్ముకుంటుడడంతో అవన్నీ రీ-సైక్లింగ్​కు, బీర్ల తయారీ కంపెనీలకు, కోళ్ల ఫారాలకు దారిమళ్లుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. 

దొడ్డుబియ్యం పంపిణీతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని భావించింది. ఈ నేపథ్యంలో నిరుపేదలకు కూడా సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. రైతులకు రూ.500 బోనస్​ చెల్లించి వానాకాలంలో 24 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించింది. వీటిని నిల్వచేసి మిల్లింగ్​ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. యాసంగిలో వచ్చే సన్నవడ్లను సైతం బోనస్ తో సేకరించి రాష్ట్రంలోని రేషన్​ లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు సివిల్ సప్లయ్స్​ శాఖ సన్నాహాలు చేస్తోంది.