ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీంకోర్టులో సర్కారు అఫిడవిట్!

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీంకోర్టులో సర్కారు అఫిడవిట్!

న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల ఫిర్యాయింపు వ్యవహారంలో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేయనున్న ట్టు సమాచారం. కారు గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్య లు, స్పీకర్ నిర్ణయం ఆలస్యాన్ని సవాల్ చేస్తూ  ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. స్పీకర్​కు తగినంత నిర్ణయం అంటే ఎంతో చెప్పాలని సూచించింది. 

అలాగే, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వీరంతా మార్చి 22 లోపు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశిస్తూ.. మార్చి 25కు విచారణను వాయిదా వేసింది. అయితే, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు.

కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. ఈ పిటిషన్లు  మంగళవారం మరోసారి విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.