- పాలసీ రెడీ చేసిన రాష్ట్ర సర్కార్
- 17 సర్క్యూట్ల పరిధిలో 64 ఎకో టూరిజం స్పాట్ల అభివృద్ధి
- మంత్రి సురేఖ నేతృత్వంలోని కన్సల్టేటివ్ కమిటీ ఆమోదం
- ఇప్పటికే కనకగిరి, అనంతగిరిలో పనులు షురూ
- పీపీపీ విధానంలో నర్సాపూర్ అర్బన్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్ వర్క్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎకో టూరిజం పాలసీ రెడీ చేసింది. ఈ ముసాయిదాకు మంత్రి కొండా సురేఖ నేతృత్వంలోని కన్సల్టేటివ్ కమిటీ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. త్వరలో అమల్లోకి రానున్న ఈ ఎకో టూరిజం పాలసీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సర్కారు భావిస్తున్నది. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటికే రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలు, జల పాతాలు, జీవ వైవిధ్య ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను గుర్తించారు.
మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించారు. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ కల్చర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మరి కొన్ని ప్రాంతాలకు కూడా టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది.
పీపీపీ విధానంలో పనులు..
అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలు సమన్వయంతో ఎకో టూరిజం పాలసీ రూపొందించాయి. పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్) విధానంలో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేస్తున్నాయి. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ సహకారంతో ఖమ్మం జిల్లాలోని కనకగిరి, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో రెండు పర్యావరణహిత పర్యాటక ప్రదేశాలు, మెదక్ జిల్లాలో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు, హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
Also Read:-ఊరికో రెవెన్యూ ఆఫీసర్.. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం - 2024 రెడీ
వన్యప్రాణులు, విదేశీ పక్షులు వలసవచ్చే జీవవైవిధ్య ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలకు, చారిత్రక ఆనవాళ్లకు నెలవైన ప్రదేశాల్లోనూ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మూడో ద్వీపం అందుబాటులోకి..
లక్నవరం జలాశయంలో తాజాగా మూడో ద్వీపాన్నిఅందుబాటులోకి తెచ్చారు. మంథని, రామగిరి కోట, కోదాడ, మధిర, జమలాపురం, సింగూర్, కొల్లాపూర్, శ్రీరంగాపూర్, కొడంగల్, నెలకొండపల్లి, పాలేరు, నాగార్జునసాగర్, సూర్యాపేట, భూపాలపల్లి, నల్గొండ, అనంతగిరి, మహబూబ్‌నగర్, జోడేఘాట్ ప్రాంతాల అభివృద్ధికి రూ. 99.46 కోట్ల పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర ఆర్థిక సాయంతో చేపట్టే పనులకు సంబంధించి రాష్ట్ర పర్యాటక శాఖ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రూ. 56.81 కోట్లతో భువనగిరి కోట, రూ.38 కోట్లతో అనంతగిరి హిల్స్, రూ. 25 కోట్లతో బుద్ధవనం, నాగర్జునసాగర్, రూ. 10కోట్లతో నిజాంసాగర్ లో మొత్తం రూ. 130 కోట్ల నిధులతో పనులను చేపడ్తున్నారు.
అలాగే రాష్ట్ర నలుమూలల ఉన్న పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. శ్రీశైలం, సోమశిల, నాగర్జున సాగర్ వరకు ఉన్న 160 కిలోమీటర్ల మేర నల్లమల అడవుల గుండా ప్రవహిస్తున్న కృష్ణా నదీ తీరం, దట్టమైన అడువులు, వన్యప్రాణులు, జలపాతాలను డెస్టినేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నది.
17 టూరిజం సర్క్యూట్లలో 64 స్పాట్లు..
ఖమ్మం జిల్లా కనకగిరి సర్క్యూట్: పులిగుండాల ఎకో రిసార్ట్స్, సత్తుపల్లి అర్బన్ పార్క్తోపాటు జమలాపురం టెంపుల్.
కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని సర్క్యూట్: కిన్నెరసాని ఎకో రిసార్ట్, డ్యామ్, జింకల పార్క్, రంగాపురం సఫారీ, జంగాలపల్లి క్యాంపు, గుబ్బల మల్లమ్మ టెంపుల్, పూసుకుంట ఫారెస్ట్, మణుగూరు జలపాతం.
- వరంగల్, మహబూబాబాద్ జిల్లా పాకాల సర్క్యూట్: పాకాల ఎకో రిసార్ట్స్, గూడూరు సాంక్చురీ- వైల్డ్ లైఫ్ సఫారీ, భీమునిపాదం జలపాతం.
- ములుగు జిల్లా ఏటూరునాగారం సర్క్యూట్: తాడ్వాయి హట్స్, టెక్కింగ్ వైల్డ్ లైఫ్ సఫారీ, బొగత జలపాతం, లక్నవరం సరస్సు.
- మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని శివ్వరాం సర్క్యూట్: శివ్వరాం సాంక్చురీ, గాంధారి ఖిల్లా.
- మంచిర్యాల- నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ సర్క్యూట్: కవ్వాల్ టైగర్ రిజర్వ్, ట్రేకింగ్- వైల్డ్ లైఫ్ సఫారీ.
- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సర్క్యూట్: గుండేపల్లి టైగర్ హాబిటెట్, ఆడ ప్రాజెక్టు, ఊల్తూరు పాయింట్.
- ఆదిలాబాద్ జిల్లా కుంటాల సర్క్యూట్: మావల, గాయత్రి, కుంటాల, పొచ్చెర జలపాతాలు.
- నిజామాబాద్-నిర్మల్ జిల్లాల్లో నందిపేట సర్క్యూట్: ఉమేద ఎకో రిసార్ట్స్, జలాల్ పూర్, బ్యాక్ వాటర్ ఎక్స్ ప్రెన్సిస్, బ్లాక్ బుక్ సఫారీ.
- నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సర్క్యూట్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మన్ననూర్ జంగిల్ రిసార్ట్స్, సోమశిల, అక్కమహాదేవి గుహలు.
- నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ సర్క్యూట్: గాజుబిడెం ఎకో రిసార్ట్స్, బ్యాక్ వాటర్, నెల్లికల్ ఎకో పార్క్, కాసరాజుపల్లి ఫారెస్ట్ వ్యూ పాయింట్, చాకలిగట్టు, ఫిషింగ్ ఎక్స్ పెన్స్.
- మెదక్ జిల్లా పోచారం సర్క్యూట్: పోచారం ఎకో స్టేస్, పోచారం సాంక్చురీ, నర్సాపూర్ అర్బన్ పార్క్.
- మేడ్చల్ జిల్లా శామీర్ పేట సర్క్యూట్: శామీర్ పేట జింకల పార్క్, కానోపివాల్స్, ఫిషింగ్ ఎక్స్ పెన్స్.
- సంగారెడ్డి జిల్లా మంజీరా సర్క్యూట్: మంజీరా ఎకో స్టేస్, క్రొకడైల్ స్పాటింగ్, బర్డ్ అబ్జర్వేటరీ.
- -వికారాబాద్ జిల్లా అనంతగిరి సర్క్యూట్: అనంతగిరి, మూసీరివర్, కోటపల్లి రిజర్వాయర్, కారవాన్ క్యాంపింగ్.
- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల్లో అర్బన్ ఎకో సర్క్యూట్: ముచ్చర్ల జూపార్క్, ఎకో ట్రయల్ పార్క్, మజీద్ గడ్డ క్యాంపు, ఫారెస్ట్రిక్ పార్క్ టెంట్ క్యాంప్, వన దృశ్యం ఫారెస్ట్ పార్క్, వెదురువనం ఫారెస్ట్ పార్క్, బయో డైవర్సీటీ పార్క్.
- భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సర్క్యూట్: పాండవుల గుట్ట, రాక్ క్లైబింగ్, ప్రతాపగిరి ఫోర్ట్..