
- వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయనున్నరాష్ట్ర ప్రభుత్వం
- రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో సాగుకు ప్రతిపాదనలు
- రాష్ట్రంలో 400 క్లస్టర్ల ఏర్పాటు
- ప్రతి క్లస్టర్‌కు 125 ఎకరాల్లో 125 మంది రైతులకు ప్రోత్సాహం
- మూడేండ్ల పాటు ఎకరానికి ఏటా రూ.8 వేలు చొప్పున సాయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేచురల్ ఫామింగ్ స్కీమ్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ స్కీంను రాష్ట్రంలో వచ్చే వానాకాలం నుంచి అమలు చేయనుంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేయడానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించింది.
దీని కోసం కమిటీలు ఏర్పాటు చేయడానికి వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి లెటర్ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే సీజన్ నుంచి నేచురల్ వ్యవసాయం అమల్లోకి రానుంది. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫామింగ్ స్కీంను రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో అమలు చేయనున్నారు. దీని కోసం జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అనువైన ప్రాంతాలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా 400 క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు.
ఒక్కో క్లస్టర్లో 125 ఎకరాలను గుర్తిస్తారు. దీని కోసం క్లస్టర్ వారీగా ముందుకు వచ్చే 125 మంది రైతులను గుర్తించనున్నారు. ఎంపికైన రైతులకు వివిధ ఎన్జీవోలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబరులో అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు నేచురల్ వ్యవసాయంపై గైడ్ లైన్స్ పంపింది. దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రసాయనాలు లేకుండా సహజ జీవ ఎరువులు, జీవ పురుగుమందులు మాత్రమే వాడుతూ పంటలు పండించాలని కేంద్రం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్ పథకంలో స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా రైతులు, స్వచ్ఛంద సంస్థలు, అభ్యుదయ రైతులు సాగుచేస్తున్న వివిధ రకాల సహజ విధానాల్లో దేనినైనా అనుసరించే స్వేచ్ఛను రైతులకు ఇచ్చింది.
గైడ్ లైన్స్‌లో పేర్కొన్న వివరాలు..
ఈ పథకంలో రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేస్తారు. సహజ ఎరువులు, జీవ పురుగుమందులు వంటి వాటిని కొన్నా ఆర్థిక సాయం అందిస్తారు. ఏ పంటకు ఎంత మోతాదులో వాడాలన్నది రైతు ఇష్టం. రైతులే సొంతంగా సహజ ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకున్నా అనుమతి ఇస్తారు. రైతులు ఒక ఎఫ్పీఓగా లేదా, ఒక సంఘంగా ఏర్పడి సాగు చేసుకోవచ్చు.
ఒకేచోట 125 ఎకరాల వరకూ రైతులు ఈ పథకం కింద పంటలు పండించడానికి ముందుకొస్తే మరిన్ని ప్రయోజనాలు ఇస్తారు. ఒక ఎకరంలో నేచురల్ ఫామింగ్‌లో పంటలు పండించడానికి ఒక్కో రైతుకు ఏడాదికి రూ.8 వేలు చొప్పున మూడేండ్ల పాటు కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ అందిస్తాయి. రైతులు సంఘాలుగా ఏర్పడి పండించే పంటకు ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకుని మార్కెట్లో అమ్ముకోవడానికి ‘వ్యవసాయోత్పత్తుల కంపెనీ’ ప్రారంభించవచ్చు.
కోత అనంతర నష్టాలు తగ్గించేందుకు అధునాతన సాంకేతిక సాయం అందిస్తారు. పంటల శుద్ధి పరిశ్రమలు, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు తదితర సదుపాయాలు అందించనున్నారు. రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పంటలు పండించారా లేదా అన్నది పంటల నమూనాలను సేకరించి ల్యాబ్‌లో టెస్టు చేస్తారు. ప్రతి క్లస్టర్ లోని రైతులకు సహజ విధానాలు, పంటల మార్కెటింగ్, ఆదాయం పెంపుపై ఏటా కనీసం మూడుసార్లు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
కొండలు, గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ రసాయనాలతో పంటలు పండించే రైతులను ఈ పథకం కింద ఎక్కువగా ప్రోత్సహించనున్నారు. అగ్రికల్చర్లో డిగ్రీ చదివిన వారిని క్లస్టర్‌కు సమన్వయకర్తగా, డిప్లొమా చదివిన వారిని ‘ప్రధాన వనరుల వ్యక్తి’గా నియమించనున్నారు. ఈ విధానానికి రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంది. మిగతా 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.