
- ప్రమాదాల నేపథ్యంలో ప్రతిపాదన సిద్ధం చేస్తున్న సర్కారు
- విద్యుత్ తనిఖీ విభాగానికి పాలసీ రూపకల్పన బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: త్వరలో లిఫ్ట్ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ యాక్ట్ -2025ను అమల్లోకి తీసుకురానుంది. లిఫ్ట్ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడంతో చాలా మంది లిఫ్ట్ ఇండస్ట్రీ ఆపరేటర్లు.. స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ బ్రేకులు వంటి సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
గతంలో లిఫ్ట్ విధానంపై ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని ప్రతిపాదించింది. ఆ విధానాన్ని రూపొందించిన ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ విభాగం అధికారులు తిరిగి అధ్యయనం చేస్తున్నారు. మరికొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనికి తుది రూపం ఇవ్వనున్నారు. ఇది కార్యరూపం దాల్చగానే మరికొద్ది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిఫ్ట్ పాలసీని అమలు చేయనున్నది.
లిఫ్ట్ ల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి!
ఈ చట్టం అమలులోకి వస్తే దేశంలో ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్న మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరసన తెలంగాణ నిలువనున్నది. ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ బిల్లు-2025ను అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ లిఫ్ట్ పాలసీని వేగవంతంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇది అమల్లోకి రాగానే లిఫ్ట్ పాలసీలో లిఫ్ట్ ఇండస్ట్రీలు, స్పేర్ పార్ట్స్తయారు చేసే సంస్థలు, భవన యజమానులు లిఫ్ట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటివరకు భవన నిర్మాణాల్లో సేఫ్టీని పర్యవేక్షించే విద్యుత్ తనిఖీ విభాగం.. లిఫ్ట్ భద్రతను కూడా పర్యవేక్షణ చేయనుంది.
లిఫ్టుల తయారీ సమయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనలు పాటించాలనే ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. లిఫ్టులపై కొత్త పాలసీ అమల్లోకి వస్తే కొంతమేరకు ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుమతులు పొందడంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాలి. అలాగే, లిఫ్టులు, బడా ఎలివేటర్లు ఏర్పాటు చేసుకోవడానికి భవన యజమానులు ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ విభాగం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ తనిఖీ విభాగం లిఫ్ట్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది.
3 వేల కోట్లకు పైగా లిఫ్ట్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ వ్యాపారం
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో దాదాపు 3 వేల కోట్లకు పైగా లిఫ్ట్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్వ్యాపారం జరుగుతోంది. ప్రతి ఏటా దాదాపు 50 వేల లిఫ్టుల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ వ్యవస్థను పకడ్బందీగా
అమలు చేస్తే.. రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాల నుంచి గట్టెక్కించవచ్చని తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం లిఫ్ట్ పాలసీ అమలవుతున్న రాష్ట్రాల్లో భవనాల యజమానులు లైసెన్సులు పొంది లిఫ్టు చట్టం కింద నిర్ణీత రుసుము చెల్లిస్తున్నారు. ఈ నిబంధనను తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది.