ఇయ్యాల్టి ( ఏప్రిల్ 14 ) నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం

ఇయ్యాల్టి ( ఏప్రిల్ 14 ) నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం
  • అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోలు రిలీజ్ చేయనున్న సర్కారు
  • మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ 
  • చట్టం తొలి జీవో కాపీని సీఎం రేవంత్​కు అందజేయనున్న కమిటీ
  • దేశంలోనే వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా  రికార్డు
  • కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు అమలు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రానున్నది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ  అమలుపై గైడ్​లైన్స్​తో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవోలు రిలీజ్ చేయనున్నది.  అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేయాలని ప్రభుత్వం, పార్టీ ప్లాన్ చేస్తున్నది. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని వన్​మెన్​ కమిషన్ ఇచ్చిన సిఫార్సులతో కూడిన బిల్లును అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించి గవర్నర్ కు పంపగా.. ఇటీవల ఆయన రాజముద్ర వేశారు. ఎస్సీలో 59 కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్​ రిపోర్ట్ అందజేసింది. ఈ రిపోర్ట్ ను అసెంబ్లీ యథాతథంగా ఆమోదించింది. 

కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్

ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని  సోమవారం నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం  సిద్ధంగా ఉందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన  ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్- కమిటీ సమావేశం ఆదివారం సెక్రటేరియెట్​లో జరిగింది. ఈ మీటింగ్ కు మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వన్ మెన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, లా సెక్రటరీ తిరుపతి, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ క్షితిజ, డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి హాజరయ్యారు. 

జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అమలు మార్గ దర్శకాలను కమిటీ క్షుణ్నంగా సమీక్షించి, జీవో  జారీ చేసేందుకు తుది ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. వర్గీకరణ చట్టం  గైడ్ లైన్స్ పై సోమవారం జీవో ఇచ్చి, తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి కేబినెట్ సబ్ కమిటీ అందజేయనున్నది. 

దేశంలోనే తొలి రాష్ట్రంగా..

సోమవారం జీవోలు రిలీజ్​ కాగానే.. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ  -వర్గీకరణను అమలు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనున్నది. నిరుడు ఆగస్టు 1న  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే రోజు వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి​ ప్రకటించారు. 2024 అక్టోబర్ లో  వర్గీకరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్  షమీమ్ అక్తర్ చైర్మన్ గా ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ ను నియమించింది.  

ఎస్సీ ఉప కులాల అంతటా సామాజిక -ఆర్థిక సూచికలను అధ్యయనం చేసే పనిని కమిషన్​ చేపట్టింది. అన్ని జిల్లాల్లో పర్యటించి వర్గీకరణపై సలహాలు, సూచనలు స్వీకరించింది.  వర్గీకరణపై కమిషన్ కు  8,600 కంటే ఎక్కువ ప్రతిపాదనలు అందగా,  జనాభా, అక్షరాస్యత , ఉద్యోగాలు,  ఉన్నత విద్య లో  ప్రవేశాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం , రాజకీయ భాగస్వామ్యం, తదితర అంశాలపై కమిషన్ అధ్యయనం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రభుత్వానికి తుది రిపోఈబర్ట్​ను కమిషన్​ అందజేసింది. అనంతరం వివిధ  సంఘాలు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించడానికి కమిషన్ టర్మ్ ను ఒక నెలపాటు ప్రభుత్వం పొడిగించింది. 


3 గ్రూపులుగా 59 ఎస్సీ కులాలు

59 ఎస్సీ కులాలు, ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వానికి వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని 15 షెడ్యూల్డ్‌‌ కులాలను కమిషన్‌‌ గ్రూప్‌‌–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్‌‌ అమలు చేయాలని సిఫారసు చేసింది. 

ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన 18 షెడ్యూల్డ్‌‌ కులాలను గ్రూప్‌‌–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్‌‌ కల్పించాలని సిఫారసు చేసింది. మెరుగైన ప్రయోజనం పొందిన 26 షెడ్యూల్డ్‌‌ కులాలను గ్రూప్‌‌–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963% ఉన్న వీరికి 5% రిజర్వేషన్‌‌ ఇవ్వాలని సిఫారసు చేసింది.

నేడు జీవో ఇస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

ఓయూ, వెలుగు: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం హర్షనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు​గవర్నర్ ఆమోదం లభించడం శుభసూచకమని పేర్కొన్నారు. ఆదివారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన జగ్జీవన్ రామ్,​ మహాత్మా జ్యోతిబాఫులే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 

సోమవారం ఎస్సీ వర్గీకరణ చట్టంపై జీవోను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగ రక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ కుమార్, రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

దశాబ్దాల డిమాండ్ నెరవేరుతున్నది: మంత్రి ఉత్తమ్

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌‌ను నెరవేర్చిందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు.  గత  ప్రభుత్వాలు ఎస్సీ  వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలను ఆమోదించినప్పటికీ, చట్టపరమైన మద్దతుతో ఎవరూ దానిని అమలు చేయలేదని చెప్పారు.  1999 నుంచి ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఈ అంశంపై చర్చించినప్పటికీ.. పరిష్కారం కాలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలనే నిర్ణయానికి జాతీయస్థాయిలో బలమైన నాయకత్వం మద్దతు ఇచ్చిందని, రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో ఈ లక్ష్యానికి మద్దతు తెలిపారని చెప్పారు.

ఎస్సీ వర్గంలో క్రీమిలేయర్​ను ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫారసును కేబినెట్ సబ్- కమిటీ తిరస్కరించినట్టు తెలిపారు.  ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఏ ఉప-సమూహాన్ని మినహాయించకుండా సమాన ప్రయోజనాలను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని  స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఏ ప్రయోజనాలను నీరుగార్చబోమని, అన్ని ఎస్సీ వర్గాల హక్కులను కాపాడుతూ న్యాయాన్ని పెంపొందించడానికి వర్గీకరణ చేసినట్టు తెలిపారు. 

2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు ప్రస్తుతం 15 శాతం  రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, తెలంగాణలో ఎస్సీ జనాభా దాదాపు 17.5 శాతానికి  పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2026 జనాభా లెక్కల డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.