మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోండి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోండి
  • కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించండి
  • సీఎం రేవంత్​ రెడ్డిని కోరిన శాంతి చర్చల కమిటీ నేతలు

హైదరాబాద్​, వెలుగు: మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జూబ్లీహిల్స్‌‌‌‌లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫె సర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవి చందర్‌‌‌‌ వినతిపత్రం సమర్పించారు. కేంద్రాన్ని ఒప్పించి కాల్పుల విరమణకు ఒప్పించాలని కోరారు. ఈ చర్చలకు తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా  సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

నక్సలిజాన్ని సామాజిక సమస్యగానే తమ ప్రభుత్వం పరిగణిస్తుందని, శాంతిభద్రతల అంశంగా చూడదని స్పష్టం చేశారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సలహాలు , సూచనలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు.