
- స్థానిక సంస్థలు, విద్య,ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు
- నేడు అసెంబ్లీలోప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా..
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు , ఎస్సీ వర్గీకరణ బిల్లులను సభలో పెట్టనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను వేర్వేరుగా పెట్టనుంది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు తేనుంది. వాటిపై సభలో చర్చించి ఆమోదించనుంది. న్యాయపరంగా చిక్కులు రావొద్దనే వేర్వేరుగా బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెడుతున్నట్టు తెలిసింది. ముందుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తర్వాత బిల్లులను కేంద్రానికి పంపనుంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కోరనుంది. కాగా, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కులగణన సర్వే చేశారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతానికి పైగా ఉన్నట్టు తేల్చారు. మొదటిసారి కులగణనలో పాల్గొనని వారికోసం రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపైనా అసెంబ్లీలో చర్చించనున్నారు.
మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ..
ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో పెట్టనుంది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి బిల్లును తెస్తున్నది. మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చింది. వీరి జనాభా ఎస్సీల్లో 3.288 శాతం ఉండగా, వీరికి ఒక్క శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. రెండో గ్రూపులో కొంతమేర లబ్ధి పొందిన 18 కులాలను చేర్చింది. వీరి జనాభా ఎస్సీల్లో 62.748 శాతం ఉండగా, వీరికి 9 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. మూడో గ్రూపులో కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను చేర్చింది.
వీరి జనాభా ఎస్సీల్లో 33.963 శాతం ఉండగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ప్రతిపాదించింది. కాగా, ఈ బిల్లులతో పాటు తిరుమల తరహాలో యాదాద్రి బోర్డు ఏర్పాటు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టే బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు పొన్నం భేటీ..
అసెంబ్లీ, కౌన్సిల్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించనున్నారు. బీసీ బిల్లుపై వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని కోరనున్నారు.