- ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు.. గైడ్‌లైన్స్ రిలీజ్
- ఈ నెల 26 నుంచి కొత్త కార్డులు జారీ
- మార్గదర్శకాలు విడుదల చేసిన సివిల్ సప్లయ్స్ కమిషనర్
హైదరాబాద్, వెలుగు: ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీకి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్డీఎస్చౌహాన్ గైడ్‌లైన్స్ జారీ చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మండలస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా సివిల్ సప్లయ్స్ ఆఫీసర్(డీసీఎస్ఓ) పర్యవేక్షించనున్నారు.
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. స్థానికంగా లిస్ట్ చదివి వినిపించి, వారి అర్హతలపై చర్చించాక ఓకే చేస్తారు. ఇలా గ్రామసభలు, వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల లిస్టును ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఇచ్చిన లాగిన్ లో నమోదు చేస్తారు. అక్కడి నుంచి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్ కు పంపిస్తారు. అలా పంపిన జాబితాను కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ వెరిఫై చేసి లిస్ట్‌ను సివిల్ సప్లయ్స్ కమిషనర్ లాగిన్ కు వేస్తారు. ఈ ఫైనల్ లిస్ట్ ప్రకారం సివిల్ సప్లయ్స్ కమిషనర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. దీంతోపాటు కార్డుల్లో పేర్ల మార్పుచేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు.
ప్రజాపాలన ద్వారా 10లక్షలకు పైగా అప్లికేషన్లు..
రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం, కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం జనం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం వివిధ సందర్భాల్లో 20 లక్షల వరకు అప్లై చేసుకోగా, 3 లక్షలకుపైగా కార్డులను బీఆర్ఎస్సర్కారు మంజూరు చేసింది. అది కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లోనే కొత్త కార్డులు ఇచ్చి వదిలేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రజాపాలన కింద రేషన్‌కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. మొత్తం 10 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయని పలు సందర్భాల్లో మంత్రులు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 17లక్షల కుటుంబాలున్నాయని ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వే అనంతరం సర్కారు ప్రకటించింది. ఆయా కుటుంబాలకు ఇప్పటికే 90లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన కులగణన సర్వే లో సుమారు 20 లక్షల కుటుంబాలు తమకు రేషన్‌కార్డులు లేవని, కొత్త రేషన్‌కార్డులు కావాలని చెప్పారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన 10 లక్షల అప్లికేషన్లకు ఇవి డబుల్ కావడంతో ప్రభుత్వం కులగణన సర్వేనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.