హైదరాబాద్ లో కల్తీ ఫుడ్ లపై ఉక్కుపాదం..రోడ్డెక్కనున్న ఫుడ్ టెస్టింగ్ వ్యాన్

హైదరాబాద్ లో కల్తీ ఫుడ్ లపై ఉక్కుపాదం..రోడ్డెక్కనున్న ఫుడ్ టెస్టింగ్ వ్యాన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో కల్తీ ఫుడ్​ నివారణకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. తనిఖీలు చేసిన తర్వాత కలెక్ట్ చేసిన శాంపిల్స్​ చెక్​ చేసేందుకు రూ.24 కోట్లతో ఐపీఎం(ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్), స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రేటర్​లో ఆరు మినీ ల్యాబ్స్​ఏర్పాటు చేయబోతోంది. బల్దియా స్థలం ఫైనల్​ చేసిన వెంటనే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. 

ఫుడ్ టెస్టింగ్ వ్యాన్ లు 

ప్రస్తుతం మన దగ్గర ఒకే ఒక్క మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వ్యాన్ ఉండడంతో ఎటూ సరిపోవడం లేదు. దీంతో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలోని హోటల్స్, స్ర్టీట్ ఫుడ్ వెండర్ల వద్ద ఆయిల్, ఇతర ఫుడ్​శాంపిల్స్​సేకరించి అక్కడే టెస్టులు చేస్తున్నారు. అయితే, మరిన్ని వాహనాలు ఉంటే ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్​టెస్ట్​చేసే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం మరో ఐదు ఫుడ్ టెస్టింగ్ వ్యాన్లను రంగంలోకి దించబోతున్నది. ఇప్పటికే వ్యాన్లను కొన్నా లోపల ఎక్విప్​మెంట్​లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత తొందరలో అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది.  

ఒక్కో ల్యాబ్​లో 50 మంది స్టాఫ్

గ్రేటర్​లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో ఒక్కో ల్యాబ్ ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ల్యాబ్ లో 50 మంది వరకు స్టాఫ్ ని నియమించనున్నారు. బల్దియాతో పాటు స్టేట్ ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు శాంపిల్స్​పంపిస్తారు కాబట్టి ఒక్కో ల్యాబ్​లో ప్రతి నెలా 600 నుంచి 700 శాంపిల్స్​టెస్ట్​చేసేలా ఏర్పాటు చేయనున్నారు.