
బషీర్బాగ్, వెలుగు: కళలను, కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం తమదని, ఇకపై ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏటా ఉగాదికి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిం దని వెల్లడించారు. కళారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు.
సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్లుగా సంగీత నాటక కళాకారులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
తమిళనాడులోని తిరువయ్యుర్ లో యేటా జరిగే త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల మాదిరిగా మన దగ్గర కూడా ఏటా వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి తాను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకుని సంగీత విధ్వాంసులుగా, వాగ్గేయకారులుగా ఎదగాలని ఆయన సూచించారు. భక్తిరస వాగ్గేయకార సంకీర్తనల ప్రచారంతో సమాజంలో సేవాభావం పెంపొందుతుందని, భవిష్యత్ తరాలకు దాన్ని అందించాలని కోరారు.
గత సర్కార్ పట్టించుకోలే
గత పదేండ్లలో అప్పటి ప్రభుత్వం కళాకారులకు ప్రోత్సాహం అందించలేదని, ఏటా ఇవ్వాల్సిన నంది అవార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం రాగానే కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టిందని తెలిపారు. సినిమా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏటా ఉగాది రోజుగద్దర్ అవార్డులు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల విజ్ఞప్తి మేరకు నాటక రంగంలోని కళాకారులను కూడా ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. నంది నాటకోత్సవాల మాదిరిగా ఏటా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
సమాజ వికాసానికి కళాకారులు కృషి చేయాలి: పొన్నం
భగవంతుడు అందరికీ కళా ప్రతిభ ఇవ్వలేదని, కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఆ అవకాశం ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భగవంతుడు ఇచ్చిన కళలను ప్రజలకు పంచి సమాజ వికాసానికి దోహదపడాలని ఆయన కోరారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కళాకారులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా, సస్య శ్యామలంగా ఉంటుందన్నారు. కళాకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా సహకారం ఉంటుందనే విషయాన్ని చెప్పాలని తనకు సీఎం రేవంత్రెడ్డి సూచించారని ఆమె తెలిపారు.
తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి 600 మంది సంగీత కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారని చెప్పారు. మే 4న త్యాగరాజ స్వామి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు యెల్లా వెంకటేశ్వరరావు, శోభారాజు, ఉమామహేశ్వరి, రాఘవాచార్యులు, హరిప్రియ, కళాకృష్ణ, కోవెల శాంత, ప్రేమ రామమూర్తి, జయప్రద, శేషులత, మంథా శ్రీనివాస్, భక్త రామదాసు వారసుడు వెంకట రమణ తదితరులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనంగా సత్కరించారు.
10 గంటల పాటు కీర్తనలు
భక్త రామదాసు కీర్తనలతో ఎల్బీ స్టేడియం మర్మోగింది. 10 గంటల పాటు మొత్తం 600 మంది రామదాసు కీర్తనలు ఆలపించారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ కార్యదర్శి బి. మనోహర్, ఆర్. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ట్యాంక్ బండ్ పై భక్త రామదాసు విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి.. ఊరేగింపుగా ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు.