
- మార్క్ఫెడ్ ద్వారా సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు
- ఈ యేడు 7.89 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో సాగైన పంట
- రూ.2,225 మద్దతు ధరతో కొనుగోళ్లకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: యాసంగిలో పండిన మక్కలు కొనేందుకు సర్కారు సిద్ధమవుతోంది. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలు ఏర్పాటు చేసి.. కొనుగోళ్లు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో యాసంగిలో సాగైన మక్కజొన్న పంట త్వరలో చేతికి రానుండటంతో అధికారులు ఈ యేడు మక్కల కొనుగోళ్లకు కసరత్తు పూర్తి చేసి, ప్రతిపాదనలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈయేడు యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7.89 లక్షల ఎకరాల్లో రైతులు మక్కలు వేశారు. యాసంగిలోనే కాకుండా తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మక్కల సాగు నమోదైంది.
యాసంగిలో మక్కల సాధారణ సాగు 5.69 లక్షల ఎకరాలు కాగా.. నిరుడు 6.45 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఈయేడు నిరుటి కంటే 1.44లక్షల ఎకరాలకు పైగా మక్కలు సాగై రికార్డు సృష్టించినట్టు వ్యవసాయశాఖ నివేదిక తేల్చింది. మక్కల సాగులో ఖమ్మం జిల్లా 1,09,288 ఎకరాల్లో సాగై టాప్లో ఉండగా.. ఆ తరువాత నిర్మల్ జిల్లాలో 1,05,041 ఎకరాల్లో, వరంగల్జిల్లాలో 1,02,321 ఎకరాల్లో సాగు చేశారు. నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైతులు యాసంగిలో మక్క ఎక్కువగా వేశారు. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు, సగటున 26.80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఇప్పటి వరకు నమోదైన సాగు విస్తీర్ణం ప్రకారం 21 లక్షల 14 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ముందస్తుగా వేసిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు కంకులు ఇరవగా.. మరి కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. మక్క కంకులు విరిసిన రైతులు మెషిన్లతో గింజలు పట్టిస్తూ.. అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కెట్కు వస్తున్న మక్కలకు క్వింటాలుకు రూ.2,300 వరకు ధర పలుకుతున్నది. మక్క పంట చేతికొస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది.
ఈయేడు పెరిగిన పంట విస్తీర్ణానికి అనుగుణంగా భారీగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులను మార్క్ ఫెడ్ సరఫరా చేస్తున్నది. రవాణా ఖర్చులు సైతం భరిస్తున్నది. ప్రభుత్వం ఈ సారి మక్కలను క్వింటాకు రూ.2,225 చొప్పున కనీస మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టనుంది. ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.50 వేల వరకు నికరాదాయం వస్తుందన్న భరోసా రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఆన్లైన్ ద్వారా రవాణా టెండర్లు..
మక్కజొన్నల రవాణాకు ఈ సారి ఆన్లైన్ విధానంలో టెండర్లు నిర్వహించాలని మార్క్ ఫెడ్ నిర్ణయించింది. ఏటా ప్రకటన ఇచ్చి మ్యాన్యువల్ పద్ధతిలో ప్రక్రియను నిర్వహించే వారు. ఈ సారి సివిల్ సప్లయ్స్తరహాలో ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులు జిల్లా మేనేజర్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు నిల్వలను తరలిచేందుకు సంస్థ ఈసారి కొత్త విధానం అమలుచేస్తోంది. దీనిపై జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.