- రేషన్ కార్డుదారులకు వచ్చే నెలాఖరు నుంచి ఇచ్చేందుకు సర్కారు యోచన
హైదరాబాద్, వెలుగు: ప్రతి కుటుంబంలోని ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున ఫైన్ రైస్ (సన్న బియ్యం)ను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. శనివారం జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించ నున్నట్టు తెలిసింది.
కొత్త వడ్లు ఇప్పుడిప్పుడే వస్తుండడంతో మిల్లాడిస్తే బియ్యం సరిగ్గా రావన్న ఉద్దేశంతో.. వడ్లను మక్కబెట్టి పట్టించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి మక్కిన వడ్లను మిల్లాడించి రేషన్ కార్డుదారులకు రేషన్‌లో సన్న బియ్యాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ పథకం అమలైతే సుమారు 92 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.