
- స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్
- ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అమలు
- ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.15 ఖర్చు
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ స్టూడెంట్లకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు గాను అన్ని సర్కార్ విద్యాసంస్థల్లో స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం అన్ని బడుల్లో ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం ఆరు, ఏడు దాకా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నాం ఒంటిగంటకు మిడ్ డే మీల్స్ అందిస్తుండగా, ఈవెనింగ్ ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు బడుల్లో టీచర్లు, ఎన్జీవోల ద్వారా నిధులు సేకరించి విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. దీన్ని అన్ని బడుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే నిధులు కేటాయించి, విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది.
ఆరు రకాల స్నాక్స్...
టెన్త్ విద్యార్థులకు సాయంత్రం ఆరు రకాల స్నాక్స్ అందించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఉడకబెట్టిన పెసర్లు, బబ్బర్లు, పల్లిపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ శనగలు అందించాలని సూచించారు. దీనికోసం ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటిని మిడ్ డే మీల్స్ ఏజెన్సీల ద్వారా చేయించాలని ఆదేశించారు. సర్కార్ నిర్ణయంపై విద్యార్థి, టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.