గుడ్ న్యూస్: ఏప్రిల్ నెలాఖరులో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్.. ఇక కొలువుల జాతర

గుడ్ న్యూస్: ఏప్రిల్ నెలాఖరులో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్.. ఇక కొలువుల జాతర
  • గత 7  నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ
  • ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  • ఇప్పుడు క్లియర్​ కావడంతో జాబ్​ క్యాలెండర్​ రీషెడ్యూల్​ చేయాలని నిర్ణయం 
  • వివిధ ప్రభుత్వ శాఖల్లో  వేలల్లో భర్తీ కానున్న పోస్టులు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్​ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్​ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో  జాబ్​ క్యాలెండర్​ను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయనున్నది. దీంతో గ్రూప్​ 1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్​ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే, ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనున్నది.  

ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.  రాష్ట్ర  ప్రభుత్వం 2024–25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. అయితే, సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉప-వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. 

అంటే 2024 సెప్టెంబర్​ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ ఆగిపోయాయి. ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆలిండియాతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్​ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ ఏడెనిమిది నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్​ పెరిగాయి. దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకుని ఆప్​డేటెడ్​గా నోటిఫికేషన్లు రిలీజ్​ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. 

ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్స్​

మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లను ఈ నెలఖారులోగా రిలీజ్​ చేయాలని ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నది. ఆర్టీసీలో 3వేల పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వ అనుమతి వచ్చినట్లు  ఆర్టీసీ ఎండీ సజ్జనార్​వెల్లడించారు. కాగా, మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. జాబ్​క్యాలెండర్​ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్​లో పోలీసు రిక్రూట్​మెంట్, మేలో  గ్రూప్–-2 సర్వీసెస్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. 

గ్రూప్​ 3 నోటిఫికేషన్​ కూడా జులైలో రావాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్ ను షెడ్యూల్​ చేయగా.. ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్​,  ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు  కూడా నిలిచిపోయాయి. వీటన్నింటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి, జాబ్​ క్యాలెండర్​ను రీషెడ్యూల్ చేయనున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్​ ఫిక్స్​ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్నది.