
- మే 1 నుంచి హైదరాబాద్‌లో అందిస్తాం
- ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని, ఇందుకోసం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కోడ్వల్ల హైదరాబాద్జిల్లా పరిధిలో సన్నబియ్యం పంపిణీ నిలిచిపోయిందని, కోడ్ ముగిసిన తర్వాత మే 1 నుంచి పంపిణీ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో ఉత్తమ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నబియ్యం సంబురాల్లో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలోనూ పాల్గొని రైతులకు సహకరించాలని సూచించారు. సన్నబియ్యం పథకం విప్లవాత్మకమైన నిర్ణయమని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కడుపుమంటతో విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ పథకానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదని, విమర్శలు చేసి ఈ పథకం ప్రాధాన్యతను దెబ్బతీయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పారు.
సన్నొడ్ల సాగు పెరిగింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయమని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. ఈ పథకంతో రాష్ట్రంలో 84 శాతం మందికి లబ్ధి చేకూరుతున్నదన్నారు. సన్నొడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో వాటి సాగు పెరిగిందని తెలిపారు. గతంలో 25 లక్షల ఎకరాలుంటే, ఇప్పుడు 40 లక్షల ఎకరాలకు చేరిందని వెల్లడించారు.