- 1.30 లక్షలకుపైగా పేద విద్యార్థులకు లబ్ధి.. ఏటా రూ.120 కోట్ల దాకా ఖర్చు
- సర్కారుకు పంపేందుకు ప్రతిపాదనలు రెడీ చేసిన ఇంటర్ విద్యాశాఖ
- నిర్వహణ ఎన్జీవోలకా? కార్మికులకా? అనే నిర్ణయం పెండింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మిడ్డే మీల్స్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ స్కీమ్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని డిసైడ్ అయింది. సర్కారు పెద్దల ఆదేశాలతో ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అధికారులు ఇందుకోసం ప్రతిపాదనలు రెడీ చేశారు. త్వరలోనే సర్కారుకు సమర్పించనున్నారు. రాష్ట్రంలో 425 సర్కారు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో 1.30 లక్షల మంది వరకూ చదువుతున్నారు.
సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్.. మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు తక్కువగా రావడం, వచ్చినా అటెండెన్స్ తక్కువగా ఉంటున్నది. దీనిపైనా సర్కారు పెద్దలు ఆరా తీయగా.. దీనికి మిడ్డే మీల్స్ లేకపోవడం కూడా ఓ కారణంగా అధికారులు గుర్తించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించింది. వచ్చే అకడమిక్ ఇయర్నుంచి మిడ్డే మీల్స్ పెట్టాలని డిసైడ్ అయింది.
ఏటా రూ. 120 కోట్లు అవసరం
మిడ్డే మీల్స్ నిర్వహణ ఏర్పాట్లు, బడ్జెట్ పై ఇంటర్మీడియెట్ అధికారులు కసరత్తు చేశారు. ఒక్కో విద్యార్థికి ఒక పూటకు కనీసం రూ.20 నుంచి రూ.23 దాకా ఖర్చు అవుతున్నట్టు అంచనా వేశారు. ఈ లెక్కన ఏటా సుమారు రూ. 110 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరక ఖర్చు అవుతాయని లెక్కగట్టారు. త్వరలోనే దీన్ని సర్కారుకు నివేదించనున్నారు.
కాగా, కార్మికులను నియమించి కాలేజీల్లోనే పిల్లలకు వండిపెట్టాలా? లేక అక్షయపాత్ర, మన్నా ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు అప్పగించాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు ప్రతిపాదనలను ఇంటర్ విద్యాశాఖ అధికారులు రెడీ చేసినట్టు తెలిసింది. 2025–26 బడ్జెట్ లో సర్కారు జూనియర్ కాలేజీల్లో మిడ్డే మీల్స్ పెట్టేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
పదేండ్లు నాన్చిన గత బీఆర్ఎస్ సర్కారు
మిడ్డే మీల్స్ అమలు విషయంలో విద్యార్థులను గతంలో బీఆర్ఎస్ సర్కారు మభ్యపెట్టింది. 2018లోనే అప్పటి విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో మంత్రులతో కమిటీ కూడా వేశారు. సర్కారు జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ... ఇలా అన్ని కాలేజీల్లో చదివే 4 లక్షల మందికి మిడ్డే మీల్స్స్కీమ్ను అమలు చేస్తామని ఆ కమిటీ ప్రకటించింది. 2020లో అప్పటి సీఎం కేసీఆర్ కూడా అదే సంవత్సరం నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు మిడ్డే మీల్స్ ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ, ఆ తర్వాతి నాలుగేండ్లలోనూ దీన్ని అమలు చేయలేదు.